ఐపీఎల్ 2024 సీజన్ నుంచి మరో ఇంగ్లండ్ పేసర్ తప్పుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) పేసర్ గస్ అట్కిన్సన్ అప్‌కమింగ్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో అతని స్థానాన్ని శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాతో కేకేఆర్ భర్తీ చేసింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వహకులు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
'ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ దూరమవడంతో అతని స్థానాన్ని శ్రీలంక ప్లేయర్ దుష్మంత చమీరాతో కేకేఆర్ భర్తీ చేసింది. చమీరాకు కేకేఆర్ అతని బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలు చెల్లించనుంది. స్వింగ్, సీమ్‌తో చమీరా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. 2018లో రాజస్థాన్ రాయల్స్, 2021లో ఆర్‌సీబీకి అతను ప్రాతినిథ్యం వహించాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఇప్పటి వరకు 12 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతను 9 వికెట్లు పడగొట్టాడు.'అని ఐపీఎల్ నిర్వాహకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
అట్కిన్సన్ దూరమవ్వడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సూచనలతోనే అతను పక్కకు తప్పుకున్నట్లు బ్రిటీష్ మీడియా పేర్కొంది. అతని వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో గస్ అట్కిన్సన్‌ను కేకేఆర్ అతని కనీస ధర కోటి రూపాయలకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఎన్నికల తేదీల ప్రకారం ఐపీఎల్ షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. ఎన్నికలున్నా.. భారత్ వేదికగానే ఐపీఎల్ 2024 నిర్వహిస్తామని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.