సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మరోసారి తీవ్ర నిరాశకు గురయ్యింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు విజయానికి సమీపంగా వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ దురదృష్టవశాత్తు విజయలాంఛనాన్ని పూర్తి చేయలేకపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫలితంలానే.. కావ్య మారన్ రియాక్షన్ కూడా క్షణాల్లో మారిపోయింది. తండ్రి కళానిధి మారన్‌తో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరైన కావ్య మారన్.. మ్యాచ్ జరుగుతున్నంత సేపు కెమెరాకు కనబడకుండా జాగ్రత్తగా మ్యాచ్ చూసింది. ఓ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉండగా.. ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు.

ఆ సమయంలో కావ్య మారన్ సైతం ముఖం చాటేసింది. కానీ హెన్రీచ్ క్లాసెన్ సంచలన బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతనికి తోడు షెహ్‌బాజ్ అహ్మద్ కూడా రెండు భారీ సిక్స్‌లు కొట్టడంతో సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. హర్షీత్ రాణా వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతినే హెన్రీచ్ క్లాసెన్ భారీ సిక్సర్ బాదాడు.
దాంతో హైదరాబాద్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కావ్య మారన్ సైతం తన తండ్రితో కలిసి ఎగిరి గంతేసింది. విజయం ఖాయమని చిరునవ్వులు చిందించింది. కానీ ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. రెండో బంతికి క్లాసెన్ సింగిల్ తీయగా.. మూడో బంతికి షెహ్‌బాజ్ అహ్మద్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు.
నాలుగో బంతికి మార్కో జాన్సెన్ సింగిల్ తీయగా.. ఐదో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్ ఔటయ్యాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరమవ్వగా.. హర్షీత్ రాణా పరుగులివ్వకుండా కట్టడిగా బౌలింగ్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ ఓటమి ఖాయమైంది. తొలి బంతికి సిక్స్ కొట్టడంతో గెలుపు ఖాయమని ఎగిరి గంతేసిన కావ్య మారన్ ఆఖరి బంతి తర్వాత దు:ఖంలో మునిగిపోయింది.
కళానిధి మారన్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యాడు. తండ్రీ, కూతురు తీవ్ర బాధతో కనిపించారు. ప్రస్తుతం కావ్య మారన్ రియాక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పాపం కావ్య పాప అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కావ్య పాప కోసమైనా మ్యాచ్‌లు గెలవాలని సన్‌రైజర్స్ ఆటగాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇక కావ్య మారన్ సన్‌రైజర్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సన్‌రైజర్స్ దారుణంగా విఫలమవుతోంది. వరుసగా నాలుగు సీజన్లలో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. దాంతో ఈ సారి రంగంలోకి దిగిన కళానిధి మారన్ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేశాడు. అయినా ఫలితం మారలేదు.