ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)పై 5 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా ముంబై వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో(5/21) ఐదు వికెట్లతో నిప్పులు చెరిగిన బుమ్రా.. ఆర్‌సీబీ పతనాన్ని శాసించడంతో పాటు పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలోనే ఆర్‌సీబీపై 5 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచిన బుమ్రా.. ఈ క్రమంలో ఆశిష్ నెహ్రా రికార్డును అధిగమించాడు. సీఎస్‌కే తరఫున నెహ్రా.. 2015 సీజన్‌లో ఆర్‌సీబీపై 4 వికెట్లు తీసాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. బుమ్రా అధిగమించాడు.
ఇక ఐపీఎల్ చరిత్రలోనే రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న నాలుగో బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. బుమ్రా కంటే ముందు జేమ్స్ ఫాల్క్‌నర్, జయదేవ్ ఉనాద్కత్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఫీట్ సాధించారు.
ఐపీఎల్ చరిత్రలోనే ఆర్‌సీబీ జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ బుమ్రా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు బుమ్రా ఆర్‌సీబీతో మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జడేజా, సందీప్ శర్మల సంయుక్త రికార్డును బుమ్రా అధిగమించాడు. ఈ ఇద్దరూ 26 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. సునీల్ నరైన్(24), నెహ్రా, హర్భజన్ సింగ్(23) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61), రజత్ పటీదార్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్)హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/21) కు తోడుగా.. గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
ఇషాన్ కిషన్(34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఆర్‌సీబీ బౌలర్లలో ఆకాశ్ దీప్, విజయ్‌కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ తలో వికెట్ తీసారు.