ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరిగిన కీలక క్వాలిఫయర్-1లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్‌తో కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
దాంతో హోరాహోరీగా సాగుతుందని భావించిన క్వాలిఫయర్-1 ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా ఏకపక్షంగా ముగిసింది. ఈ ఓటమితో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. శుక్రవారం చెన్నై వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. హెన్రీచ్ క్లాసెన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), ప్యాట్ కమిన్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/34) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్‌లో ఓడినా.. క్వాలిఫయర్-2లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుతుందని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్ సెంటిమెంట్ రీపిట్ అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్ అని జోస్యం చెబుతున్నారు. 2015లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ గెలిచిందని ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
ఇక 2023 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచిందని, ఆ లెక్కన ఐపీఎల్ 2024 టైటిల్‌ను సన్‌రైజర్స్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.