టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెమటలు చిందిస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2024 కోసం మరింత ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో గంటలకొద్దీ శ్రమిస్తున్నాడు. తన వర్కౌట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటున్న హార్దిక్ పాండ్యా.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేశాడు.
ఈ ఫొటోలో హార్దిక్ పాండ్యా.. జిమ్‌లో తీవ్రంగా శ్రమించి వర్కౌట్స్ మధ్య రిలాక్స్ అవుతున్నట్లు కనిపించాడు. చెమటలతో నిండిన అతని సిక్స్ ప్యాక్ బాడీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

చీలమండ గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 నుంచి అర్థాంతరంగా తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. బంగ్లాదేశ్‌తో లీగ్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ.. ఫాలోత్రూలో బ్యాటర్ ఆడిన షాట్‌ను ఆపే క్రమంలో గాయపడ్డాడు. అతని చీలమండలో తీవ్ర గాయం కావడంతో ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ఆడలేదు. సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించడం కోసం అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ కూడా ఆడటం లేదు. నేరుగా ఐపీఎల్ 2024లోనే హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ఆ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది. దాంతో ఐపీఎల్ 2024లో రీఎంట్రీ ఇచ్చేందుకు హార్దిక్ బాగా శ్రమిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నాడు. ఐపీఎల్‌లో సత్తా చాటి.. టీ20 ప్రపంచకప్‌లోనూ చెలరేగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.