చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగానే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. ధోనీ కారణంగానే ఓటమిపాలయ్యామని తెలిపాడు. వికెట్ల వెనుకాల ఉంటూ ధోనీ తమ బౌలర్లను అద్భుతంగా నడిపించాడని తెలిపాడు. మతీష పతీరణ తమ విజయవకాశాలను దెబ్బతీసాడని చెప్పాడు. 'ఇది సునాయసంగా చేధించాల్సి లక్ష్యమే. కానీ చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

ముఖ్యంగా పతీరణ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య తేడా అతని ప్రదర్శనే. చెన్నై తెలివైన ప్రణాళికలతో బరిలోకి దిగింది. ముఖ్యంగా వికెట్ల వెనుకాల ఉండే పెద్ద మనిషి ఈ వికెట్‌కు తగ్గట్లుగా బౌలర్లను నడిపించాడు. అది చెన్నైకి కలిసొచ్చింది. ఈ పిచ్ కాస్త నెమ్మదిగా ఉండటంతో పాటు బ్యాటింగ్‌కు కష్టంగా మారింది.
గెలవాలనే కసితో మేం బాగానే బ్యాటింగ్ చేశాం. పతీరణ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి దెబ్బతీసే వరకు బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించాం. మేం ఇంకాస్త భిన్నంగా వ్యవహరించాల్సింది. పర్సంటేజ్ క్రికెట్ ఆడటం నాకు ఇష్టం. శివమ్ దూబేకు స్పిన్ కంటే పేసర్లను ఎదుర్కొవడం కష్టం. తమ తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో మేం విజయం సాధించాలి. మంచి క్రికెట్‌తో పాటు ఉద్దేశంతో ఆడాల్సిన అవసరం ఉంది.'అని హార్దిక్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ (63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 105 నాటౌట్) శతక్కొట్టగా.. తిలక్ వర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31)పర్వాలేదనిపించాడు.
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ(4/28) నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ తీసారు.