ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒంటరి వాడయ్యాడా? జట్టులో సీనియర్ ఆటగాళ్ల నుంచి సహకారం లభించడం లేదా? ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో పరాజయం అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడిన మాటలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
రుతురాజ్ గైక్వాడ్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అండగా ఉంటున్నాడని, బౌలింగ్ మార్పుల విషయంలో వికెట్ల వెనుకాల ఉంటూ కీలక సలహాలు ఇచ్చాడని, పిచ్‌కు తగ్గట్లు నిర్ణయాలు తీసుకొని విజయం సాధించారని తెలిపాడు. ధోనీ సలహాల వల్లనే ఓడిపోయామని చెప్పిన హార్దిక్ పాండ్యా.. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీని మాత్రం మెచ్చుకోలేదు.

తద్వారా ముంబై ఇండియన్స్‌లో తనకు అలాంటి సహకారం కరువైందని పరోక్షంగా వెల్లడించాడు. దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా ఒంటరయ్యాడని, తనకు జట్టులో సహకారం లభించడం లేదని ఫీలవుతున్నాడని తెలిపాడు. ధోనీ గురించి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డాడు.
రుతురాజ్ గైక్వాడ్, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మార్పు ఒక్కసారే జరిగినా.. ఇరు జట్లలోని పరిస్థితులకు చాలా తేడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిర్ణయాలన్నీ ధోనీ తీసుకుంటాడు. కానీ ముంబై ఇండియన్స్ జట్టులో ఆ టీమ్ ఓనర్స్‌దే తుది నిర్ణయం. కెప్టెన్సీ మార్పు కూడా వాళ్లు తీసుకున్నదే. ధోనీ మాత్రం కెప్టెన్సీ మార్పుపై గత రెండేళ్లు కసరత్తులు చేశాడు.
ముందుగా రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు ఇవ్వగా అతను విఫలమయ్యాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. రెండేళ్ల ట్రైనింగ్ అనంతరం సారథ్య బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలోనే అతను రుతురాజ్ గైక్వాడ్‌కు ప్రతీ విషయంలో అండగా నిలుస్తున్నాడు.
మరోవైపు సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయం రోహిత్ శర్మతో పాటు జట్టులోని కొందరు ఆటగాళ్లు, అభిమానులకు నచ్చలేదు. అయినా రోహిత్ శర్మ తన భుజాలపై చేయి వేసి అండగా నిలుస్తాడని హార్దిక్ పాండ్యా భావించాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ప్లేయర్‌గానే జట్టులో కొనసాగుతున్నాడు.
రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు దక్కుతాయని ఆశించిన సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలు సైతం హార్దిక్ నియామకంపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. బుమ్రా, హార్దిక్ మధ్య ఉన్న విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. జట్టులోని కుర్రాళ్లు సైతం రోహిత్ శర్మతోనే క్లోజ్‌గా ఉంటున్నారు. దాంతో హార్దిక్ ఒంటరివాడినైనట్లు ఫీలవుతున్నాడు. ఈ ఒత్తిడితోనే అతను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.