ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ స్టాఫ్‌లో తాను ఉండి ఉంటే పృథ్వీ షా చెంప చెల్లుమనిపించేవాడినని తెలిపాడు. సూపర్ ఫామ్ కనబరుస్తున్న పృథ్వీ షా అనవసరపు షాట్లతో ఔటవుతున్నాడని భజ్జీ మండిపడ్డాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది రెండో విజయం మాత్రమే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులే చేసింది.

కుల్దీప్ యాదవ్(3/20) ధాటికి 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆయూష్ బదోని(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 170 పరుగులు చేసి గెలుపొందింది.
అరంగేట్ర ప్లేయర్ జేక్స్ ఫ్రేస్ మెక్‌గర్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అయితే పృథ్వీ షా(22 బంతుల్లో 6 ఫోర్లతో 32) ధాటికి ఢిల్లీ పవర్ ప్లేలోలోనే 60 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
ఈ పరిస్థితుల్లో పృథ్వీ షా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. నిర్లక్ష్యంగా అతను వికెట్ పారేసుకోవడంపై హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. పృథ్వీ షా ఔటైన సమయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పృథ్వీ షా షాట్ సెలెక్షన్‌ను తప్పుబడుతూ విమర్శలు గుప్పించాడు.
'అతను ఏం చేస్తున్నాడు? నేనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉండి ఉంటే.. పృథ్వీ షా చెంప చెల్లుమనిపించేవాడిని. అతనికి ఆ షాట్ ఆడాల్సిన అవసరమే లేదు. నిర్లక్ష్యపు షాట్‌తో అతను ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. కానీ పృథ్వీ షా చెత్త షాట్లు ఆడటం అలవాటుగా చేసుకున్నాడు. ఈ ప్రవర్తనను అతను మార్చుకోవాలి.'అని హర్భజన్ సింగ్ సూచించాడు.