ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సీజన్‌లోనే అసాధారణ ప్రదర్శనతో అనూహ్య ఫలితాలు సాధించి ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్.. గతేడాది తృటిలో టైటిల్ చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచింది. హార్దిక్ పాండ్యా సారథ్యం.. ఆశిష్ నెహ్రా పర్యవేక్షణలో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్.. మూడో సీజన్‌లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతోంది.
అయితే ఈ సీజన్ ముంగిటే ఆ జట్టు హార్దిక్ పాండ్యాను కోల్పోవాల్సి వచ్చింది. క్యాష్ డీల్ ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యా.. తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్.. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెళ్లిపోయినా.. ఆ జట్టు కోర్ టీమ్ అంతా అలానే ఉండటంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

పైగా దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ కత్తిలాంటి ఆటగాళ్లను తీసుకుంది. భారత దేశవాళీ బిగ్ హిట్టర్ షారూఖ్ ఖాన్‌ను రూ. 7.40 కోట్లకు తీసుకున్న గుజరాత్.. ఆసీస్ లెఫ్టార్మ్ యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్‌ను రూ. 10 కోట్లకు తీసుకుంది.
యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్‌ను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. భారత వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను రూ. 5.80 కోట్లకు తీసుకున్న గుజరాత్.. కార్తీక్ త్యాగీని రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. భారత అనామక పేసర్ సుశాంత్ మిశ్రా కోసం రూ. 2.2 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో చాకచక్యంగా వ్యవహరించిన గుజరాత్... తమ బలహీనతను అధిగమించింది.
టీమ్ కాంబినేషన్ ఏంటంటే..?
ఆన్‌పేపర్‌పై గుజరాత్ టైటాన్స్ భీకరంగా కనిపిస్తోంది. జట్టులోని ఆటగాళ్లంతా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గుజరాత్ టైటాన్స్ సునాయసంగా ప్లేఆఫ్స్‌కు చేరుతోంది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా బరిలోకి దిగే అవకాశం ఉంది. సాహా వయసు దృష్ట్యా అతన్ని పక్కనపెట్టాలనుకుంటే మాథ్యూ వేడ్ లేదా యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ జట్టులోకి వస్తాడు.
మిడిలార్డర్‌లో సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్‌తో పాటు అజ్మతుల్లా ఓమర్జాయ్ బరిలోకి దిగనుండగా.. లోయరార్డర్‌లో షారూఖ్ లేదా రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ఆడుతారు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే నూర్ అహ్మద్ జట్టులోకి వస్తాడు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం స్పెన్సర్ జాన్సన్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ లేదా ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఓమర్జాయ్, షారుఖ్ ఖాన్/రాహుల్ తెవాటియా, రషీధ్ ఖాన్, నూర్ అహ్మద్/స్పెన్సర్ జాన్సన్, మహమ్మద్ షమీ, కార్తీక్ త్యాగీ/ఉమేశ్ యాదవ్/మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు:
డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నలకందే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తేవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, షారూఖ్ ఖాన్(రూ. 7.40 కోట్లు), ఉమేశ్ యాదవ్(రూ. 5.80 కోట్లు), సుశాంత్ మిశ్రా(రూ. 2.2 కోట్లు), కార్తీక్ త్యాగీ(రూ. 60 లక్షలు), మానవ్ సుథార్(రూ. 20 లక్షలు), స్పెన్సర్ జాన్సన్(రూ. 10 కోట్లు), రాబిన్ మింజ్(రూ. 3 కోట్లు), అజ్మతుల్లా ఓమర్జాయ్(రూ.50 లక్షలు).