వన్డే ప్రపంచకప్ 2023 ముగియడంతో అందరి ఫోకస్ ఐపీఎల్ 2024 సీజన్‌పై పడింది. డిసెంబర్‌లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు సంబంధించిన మినీ వేలం జరగనుండటంతో.. ఏ జట్టు ఏ ఆటగాళ్లను వదులుకుంటుంది? ఎవరిని అంటిపెట్టుకుంటుందనేది చర్చనీయాంశమైంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, టీమిండియా టీ20 సారథి హార్దిక్ పాండ్యా మళ్లీ ముంబై ఇండియన్స్ గూటికి చేరుతున్నాడనే వార్తలు అభిమానులను షాక్‌కు గురి చేసాయి.
ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఒప్పందం జరిగినట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. అయితే హార్దిక్ పాండ్యాకు బదులు ముంబై ఇండియన్స్ ఎవర్నీ గుజరాత్‌కు వదులుకుంటుందనేది తెలియాల్సి ఉంది. అయితే అటు గుజరాత్ టైటాన్స్ గానీ.. ఇటు ముంబై ఇండియన్స్ గానీ ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఆటగాళ్లను మార్చుకోవడానికి ఫ్రాంచైజీలకు ఆదివారం వరకు గడువు ఉంది. రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను కూడా రేపటిలోపు బీసీసీఐకు అందజేయాలి. ట్రేడింగ్ విండో ద్వారా ఆటగాళ్లను పరస్పరం మార్చుకోవడంతో ఇరు ఫ్రాంచైజీల అంగీకారంతో కొనుగోలు చేసుకోవచ్చు.
ఇక రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకోవడంతో భవిష్యత్తు సారథిపై ఫోకస్ పెట్టిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్‌తో భారీ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టుకు భారీ ఆఫర్ ఇచ్చి హార్దిక్‌ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
హార్దిక్ పాండ్యా ఏడేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2015లో కనీస ధర రూ.10 లక్షలకు పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయగా.. సంచలన ప్రదర్శనతో మరుసటి ఏడాదే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు.
వెన్ను గాయంతో సుదీర్ఘ విరామం తీసుకున్న హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదులుకుంది. అతడిని సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2023 టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్నాడు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆ జట్టు ఓటమిపాలైంది.
ఇక హార్దిక్ పాండ్యా జట్టు మారడంపై చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఒప్పందం పూర్తి కాలేదని గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైతే.. గుజరాత్ టైటాన్స్‌ను శుభ్‌మన్ గిల్ నడిపించనున్నాడు.