ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది పోరులో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో కనీస పోటీనివ్వలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణం కమిన్స్ తీసుకున్న తప్పుడే నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టాస్ గెలిచిన కమిన్స్.. పిచ్ కండిషన్స్ పట్టించుకోకుండా బ్యాటింగ్ తీసుకోవడమే కేకేఆర్‌కు కలిసొచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విజయానంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కమిన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ నిర్ణయమే తమకు కలిసొచ్చిందని చెప్పాడు. మిచెల్ స్టార్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కమిన్స్‌ను బాధ్యుడిని చేస్తూ కొందరు సన్‌రైజర్స్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే సన్‌రైజర్స్ ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా బరిలోకి దిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బలమే బలహీనతై..
వాస్తవానికి కమిన్స్ నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళిక ఉంది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న స్లో వికెట్‌పై సాధారణ లక్ష్యం నమోదు చేసినా విజయం సాధించవచ్చనే వ్యూహం ఉంది. ఫైనల్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లపై అనవసర ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిలో ఛేజింగ్ చేయడం చాలా కష్టమని భావించిన కమిన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 160-170 రన్స్ చేసినా సునాయసంగా గెలవచ్చని భావించాడు.

డ్యూ ప్రభావం ఏ మాత్రం లేనందున క్వాలిఫయర్-2 తరహాలో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించినట్లు కేకేఆర్‌పై గెలవచ్చని అనుకున్నాడు. కానీ పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకున్న కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బ్యాటర్ల బలహీనతలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ఫలితం రాబట్టింది. వరుస వికెట్లతో కోలుకోలేని దెబ్బతీసింది.
అసలు పోరులో..
ఈ సీజన్ మొత్తం అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హెన్రీచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠిలను త్వరగా ఔట్ చేసిన కేకేఆర్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. చివరి వరకు అదే ఆధిపత్యం చెలాయించి అద్భుత విజయాన్నందుకుంది. సీజన్ మొత్తం సత్తా చాటిన ఆటగాళ్లే తుది పోరులో చేతులెత్తేసారు.
కష్టకాలంలో ఆదుకోవాల్సిన మిడిలార్డర్ కూడా తుస్సుమనిపించింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఘోర పరాభావం తప్పలేదు. మ్యాచ్ అనంతరం కమిన్స్ చెప్పినట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ 160+ రన్స్ చేసుంటే మ్యాచ్ మరింత హోరాహోరీగా సాగేది.