ఐపీఎల్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. కళ్లు చెదిరే వేడుకలతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేచింది. చెన్నైలోని చెపాక్ మైదానం అభిమానులతో నిండిపోగా.. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ దేశభక్తి గేయాల మధ్య.. కళ్లు జిగేల్‌మనే లైట్లు, లేజర్ షోలు, బాణాసంచా విన్యాసాలతో ఈ వరల్డ్ బెస్ట్ క్రికెట్ లీగ్ మొదలైంది. ఏఆర్ రెహ్మాన్‌తో ప్లే బ్యాక్ సింగర్ సోనూ నిగమ్ తన పాటలతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ డ్యాన్స్‌లతో అలరించారు. ఆరంభ వేడుకలు అట్టహాసంగా సాగిన.. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ షెఫాలీ బగ్గాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె యాంకరింగ్ చాలా చెత్తగా ఉందని మండిపడుతున్నారు. ఆరంభ వేడుకలు ముగిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా షెఫాలీ బగ్గాపై విమర్శలు గుప్పించారు.

'ఎవతి రా ఇది.. యాంకరా? జూనియర్ ఆర్టిస్టా?'అని ఘాటుగా ట్రోల్ చేశారు. ఆమె వ్యాఖ్యానంలో స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. 'ఆమె యాంకరింగ్‌తో నా చెవులకు చిల్లులు పడ్డాయి.. యాంకరింగ్ అత్యంత నాసీరకం, ఎవరీ చెత్త యాంకర్..? అసలు ఈమెకు ఎవరు అవకాశం ఇచ్చారు?'అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. దాంతో షెఫాలీ బగ్గా ట్రెండింగ్‌లో నిలిచారు.
ఆమె ఎవరా? అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తికనబర్చారు. ఇండియా టీవి యాంకర్, జర్నలిస్ట్ అయిన షెఫాలీ బగ్గా.. 1994 జూలై 1న ఢిల్లీలో జన్మించింది. న్యూస్ ప్రజెంటర్‌గా.. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఐపీఎల్‌లో యాంకరింగ్ చేయడం ఆమెకు ఇదే తొలిసారి. ఇటీవలే శ్రీలంకలో ముగిసిన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ టోర్నీకి ఆమె యాంకర్‌గా వ్యవహరించింది. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షో 2019 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువ ప్లేయర్ అనూజ్ రావత్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(23 బంతుల్లో 8 ఫోర్లతో 35) శుభారంభం అందించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.