ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో పరాజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై శుక్రవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) చేతిలో చిత్తయ్యింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఓడిన తొలి జట్టుగా ఆర్‌సీబీ అప్రతిష్టను మూటగట్టుకుంది.
అయితే ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లను సొంత అభిమానులే ఏకీపారేస్తున్నారు. ముందుగా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అతనికి అండగా కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) రాణించారు.

పేలవ బౌలింగ్..
మిగతా బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. పేలవ బౌలింగ్‌తో 183 పరుగుల పోరాడే లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్ స్లోగా.. టూ మచ్ పేస్‌గా ఉండటంతో భారీ షాట్లు ఆడలేకపోయారు. అయితే వికెట్ ఓ ఎండ్ స్లోగా ఉంటే.. మరో ఎండ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.
ఈ విషయాన్ని ఆర్‌సీబీ బ్యాటర్లు పసిగట్టలేకపోయారు. బౌలర్లు అయితే పిచ్ కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్ చేయలేక పవర్ ప్లేలోనే 85 పరుగులు ఇచ్చి చేతులెత్తేసారు. విజయ్ కుమార్ వైశాఖ్ మినహా మరే బౌలర్ ప్రభావం చూపలేకపోయారు. స్లో కట్టర్స్ వర్క్ అవుతున్నాయనే విషయం తెలిసి కూడా బౌన్సర్లు, ఫాస్ట్ బాల్స్‌తో మూల్యం చెల్లించుకున్నారు.
అమ్మాయిలను తీసుకోండి..
పేలవ బౌలింగ్‌తో ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జట్టులో ఉన్న బౌలర్ల వల్ల చేతకావడం లేదని, వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీని గెలిపించిన ఎల్లిస్ పెర్రీ, శ్రేయాంక్ పాటిల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఎగతాళి చేస్తున్నారు. శ్రేయాంక పాటిల్ స్పిన్నర్లు లేని లోటును తీరిస్తే.. ఎల్లిస్ పెర్రీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని సలహాలు ఇస్తున్నారు.
కోహ్లీ జిడ్డు బ్యాటింగ్..
కొందరు విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను తప్పుబడుతున్నారు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడని విమర్శిస్తున్నారు. అతను స్లోగా ఆడటం వల్ల మిగతా బ్యాటర్లు ఒత్తిడికి లోనై పెవిలియన్ చేరారని కామెంట్ చేస్తున్నారు.
20 ఓవర్ల పాటు విరాట్ కోహ్లీని బ్యాటింగ్ చేయించడమే తమ వ్యూహమని కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ చెప్పినట్లుగా సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు మాత్రం కోహ్లీ లేకుంటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదని ఈ విమర్శలను తప్పుబడుతున్నారు.