ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తమ కెప్టెన్‌ను మారుస్తూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడాన్ని సహించలేకపోతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
మరో రెండేళ్ల పాటు రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొందరు అభిమానులు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేయగా.. మరికొందరు ఐపీఎల్ 2024 సీజన్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకొందరైతే జట్టు మారాలని సలహాలు ఇస్తున్నారు.

టీమ్ భవిష్యత్తు కోసమే హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేశామని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వివరణ ఇచ్చినా.. సర్దుకోలేకపోతున్నారు. టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయంపై రోహిత్ శర్మతో పాటు అతని సతీమణి రితికా సజ్దే, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ముగ్గురు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 10 రోజులే సమయం ఉండగా.. కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌పై వస్తున్న ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఇక కెప్టెన్సీ మార్పును తప్పుబడుతూ ఓ నెటిజన్ బాహుబలి సినిమా సీన్‌తో క్రియేట్ చేసిన ట్రోల్ వీడియో ప్రస్తుతం నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది.
బాహుబలి సినిమాలోని పట్టాబిషేకం సీన్‌ను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుతో పోల్చుతూ రూపొందించిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో భల్లాల దేవ(రానా).. బాహుబలి(ప్రభాస్)కి పట్టాభిషేకం జరగకుండా కుట్ర చేస్తాడు. భల్లాల దేవ కుట్రను పసిగట్టని రాజమాత(రమ్యకృష్ణ).. భల్లాల దేవను తమ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తోంది. అయితే భల్లాల దేవకు ప్రజల నుంచి మద్దతు ఉండదు.
పట్టాభిషేకం సమయంలో ఈ విషయం స్పష్టమవుతోంది. భల్లాలా దేవ రాజుగా తన బాధ్యతలు స్వీకరించినప్పుడు పట్టించుకోని జనాలు.. బాహుబలి సైన్యాధిపతిగా బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు సభ మొత్తం దద్దరిల్లేలా నినాదాలు చేస్తారు. ఇదే సీన్‌లో రాజమాతను నీతా అంబానిగా.. భల్లాల దేవగా హార్దిక్ పాండ్యాను.. బాహుబలిగా రోహిత్ శర్మను స్పూఫ్ చేస్తూ.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయానికి అభిమానుల మద్దతు లేదనే విషయాన్ని సదరు నెటిజన్ వివరించే ప్రయత్నం చేశాడు.