IPL 2024, CSK Release Ben Stokes: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించింది. ఊహించినట్లుగానే ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ బై చెప్పింది. అతనితో పాటు మొత్తం 8 మంది ఆటగాళ్లను వదులుకుంది.
రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించేందుకు బీసీసీఐ విధించిన గడువు నేటితో ముగియడంతో అధికారిక బ్రాడ్ కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా ఐపీఎల్ రిటెన్షన్ ప్రోగ్రామ్స్‌తో ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ జాబితాలను వెల్లడించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి.

బెన్ స్టోక్స్‌తో పాటు డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, అంబటి రాయుడు, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్, సిసండ మగలాలను చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి వదిలేసింది. శుభవార్త ఏంటంటే అప్‌కమింగ్ సీజన్‌లోనూ మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగుతాడని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో తమ సంప్రదాయానికి విరుద్దంగా రూ. 16.25 కోట్ల భారీ ధర పెట్టి బెన్ స్టోక్స్ కొనుగోలు చేసింది. అతను మొకాలి గాయంతో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఇంగ్లండ్ పయనమయ్యాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2024 నేపథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ ఆడనని బెన్ స్టోక్స్.. సీఎస్‌కేకు సమాచారమిచ్చాడు. దాంతో అతన్ని చెన్నై వదులుకోవాల్సి వచ్చింది.
నాలుగు రోజుల క్రితమే బెన్ స్టోక్స్ అప్‌కమింగ్ సీజన్ ఆడటం లేదని చెన్నై సూపర్ కింగ్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. 8 మంది ఆటగాళ్లను వదులు కోవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ పర్స్ మనీ వాల్యూ రూ. 32.1 కోట్లకు చేరింది. ఈ డబ్బుతోనే చెన్నై సూపర్ కింగ్స్ డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ 2024 మినీ వేలంలో పాల్గొననుంది.
చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్ల జాబితా:
బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, అంబటి రాయుడు, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్, సిసండా మగలా
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్డ్ లిస్ట్:
మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతీరణ, సిమ్రాన్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలాంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, షేక్ రషీద్, నిశాంత్ సిందు, అజయ్ మండల్