గత 17 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఈ సారి కూడా పేలవ ప్రదర్శనతో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒకేదాంట్లో గెలిచిన ఆర్‌సీబీ.. అన్ని విభాగాల్లో విఫలమవుతోంది. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.
2009, 2016 సీజన్లలో ఫైనల్ చేరినా తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. ప్రతీ సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఊరించి ఊసురుమనిపించడం ఆ జట్టుకు అలవాటుగా మారిపోయింది. కోచ్‌లు మారినా.. ఆటగాళ్లు కొత్తవాళ్లు వచ్చినా చివరికి సారథి మార్చినా ఆ జట్టు తల రాత మాత్రం మారడం లేదు.

ఫాఫ్ డుప్లెసిస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత మెరుగైన ప్రదర్శన చేసిన ఆర్‌సీబీ దురదృష్టవశాత్తు టోర్నీలో ముందడుగు వేయలేకపోతుంది. ప్రధానంగా ఆ జట్టును బౌలింగ్ వైఫల్యం వేధిస్తోంది. స్టార్ ఆటగాళ్లతో భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా.. బౌలింగ్ విభాగం మాత్రం దారుణంగా విఫలమవుతోంది.
అయితే ఆర్‌సీబీ ఈ సీజన్‌లోనే కాకుండా మరో ఐదు సీజన్ల వరకు టైటిల్ గెలిచే అవకాశం లేదని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) అంచనా వేసింది. ఛాట్ జీపిటీ మాత్రం 2027లో ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని చెప్పగా.. ఏఐ మాత్రం 2029 వరకు టైటిల్ గెలిచే సీన్ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
2050 సీజన్ వరకు చాట్ జీపీటీ ఐపీఎల్ ఛాంపియన్స్‌ను అంచనా వేయగా.. ఏఐ 2043 వరకు జోస్యం చెప్పింది. వచ్చే 20 ఏళ్లలో ఆర్‌సీబీ రెండు సార్లు మాత్రమే విజేతగా నిలుస్తుందని ఏఐ అంచనా వేయగా.. చాట్ జీపీటీ మాత్రం మూడు సార్లు గెలుస్తుందని తెలిపింది. టీమ్ బల బలాలు, ఆర్థిక వనరులను బట్టి ఈ అంచనా వేసింది. ప్రస్తుతం ఏఐ, చాట్ జీపీటీ జోస్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.