IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకొని భారంగా మారిన ప్లేయర్లను వదిలేసాయి. అయితే రిటెన్షన్ ప్రక్రియ ముగిసినా ఆటగాళ్ల ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు అవకాశం కల్పించడం చర్చనీయాంశమైంది.
ఎప్పుడైనా ట్రెడింగ్ విండో ముగిసిన తర్వాతే రిటైన్షన్ ప్రక్రియను ముగించేవారు. కానీ ఈ సారి సంప్రదాయానికి విరుద్దంగా ఆటగాళ్ల ట్రేడింగ్‌కు అవకాశం కల్పించారు. దాంతోనే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్.. క్యాష్ డీల్ ద్వారా గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాను తీసుకుంది. తమ పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఆర్‌సీబీకి ఇచ్చేసింది. ఈ క్రమంలో ట్రేడింగ్ విండో అనే పదం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఈ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం.

ఇరు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను మార్చుకోవడమే ట్రేడింగ్. ఈ ట్రేడింగ్‌లో రెండు రకాలున్నాయి. వన్ వే ట్రేడ్(క్యాష్ డీల్), టూవే ట్రేడ్(ఆటగాళ్ల స్వాపింగ్). ఐపీఎల్ 2009లో ఈ రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇరు జట్లు తమ ఆటగాళ్లను వారి వేలం ప్రైజ్‌ను చెల్లించి తీసుకోవాలి. ఇది పూర్తిగా ఇరు జట్ల మధ్య జరిగే డీల్.
క్యాష్ డీల్ అంటే సదరు ఆటగాడికి పాత ఫ్రాంచైజీ ఇచ్చే డబ్బులతో ట్రాన్సఫర్ ఫీజును చెల్లించాలి. ట్రాన్సఫర్ ఫీజు ఎంత అమౌంట్ అనేది ఇరు ఫ్రాంచైజీల పరస్పర అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. ఈ అమౌంట్‌పై ఎలాంటి పరిమితి లేదు. టీమ్ పర్స్ వాల్యూపై కూడా దీని ప్రభావం ఉండదు. ఆ అమౌంట్ ఎంతా? అనేది ఐపీఎల్ నిర్వహకులతో ఇరు ఫ్రాంచైజీలకు మాత్రమే తెలుస్తోంది.
ఈ ట్రాన్స్‌ఫర్ ఫీజులో 50 శాతం సదరు ఆటగాడికి చెల్లించాలి. కానీ ఇది కూడా ఇరు ఫ్రాంచైజీల ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుంది. ట్రాన్సఫర్ ఫీజులో 50 శాతం సదరు ప్లేయర్‌కు చెల్లిస్తారా? అనేది కచ్చితంగా చెప్పలేం.
ట్రేడింగ్ విషయంలో ఆటగాడి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. ట్రేండింగ్ విషయంలో ప్లేయర్స్ ఇన్షియేట్ తీసుకోవచ్చు. క్యాష్ ట్రేడ్ విషయంలో పాత ఫ్రాంచైజీ తీసుకున్నదే తుది నిర్ణయం. తమ ఆటగాడిని వదులుకోవడం ఆ జట్టుకు ఇష్టం లేదంటే అతనికి ఇష్టం లేకపోయినా అదే జట్టులో కొనసాగాలి.
ఈ రూల్ ప్రకారమే ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి రావాలని ఉందని సమాచారమిచ్చారు. వాళ్లు క్యాష్ ట్రేడింగ్, ప్లేయర్స్ స్వాపింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు సిద్దమయ్యారు. చివరకు గుజరాత్ టైటాన్స్ క్యాష్ డీల్‌కు ఒప్పుకోవడంతో హార్దిక్ పాండ్యా ప్రైజ్ రూ.15 కోట్లు చెల్లించడంతో పాటు ట్రాన్సఫర్ ఫీజును కూడా చెల్లించారు.