రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)పై టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు తన అక్కసును వెళ్లగక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిందనే బాధలో ఆర్‌సీబీ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. ప్లే ఆఫ్స్ చేరితేనే ఆర్‌సీబీ, ఆ జట్టు అభిమానులు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చాడు.
అంతేకాకుండా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవాలని కూడా కోరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆర్‌సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ దుమ్మురేపింది.

చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యశ్ దయాల్ సంచలన బౌలింగ్‌తో 27 పరుగుల తేడాతో విజయం సాధించి మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సీఎస్‌కేను ప్లే ఆఫ్స్ చేర్చేందుకు చివరి వరకు ధోనీ, జడేజా చేసిన పోరాటం ఫలించలేదు. దాంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆర్‌సీబీ అసాధారణ విజయం..
ఈ సీజన్ ఫస్టాఫ్‌లో 8 మ్యాచ్‌లకు ఒక్కటే గెలిచిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరింది. దాంతో సీఎస్‌కేపై విజయానంతరం ఆర్‌సీబీ ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. అభిమానులు అయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు చెన్నై ఓటమిని రాయుడు తట్టుకోలేకపోయాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. అనంతరం స్టార్ స్పోర్ట్స్ షోలో మాజీ క్రికెట్ వరుణ్ అరుణ్‌తో కలిసి ఆర్‌సీబీ విజయంపై స్పందించాడు. ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని వరుణ్ అరుణ్ చెప్పగా.. ఇప్పటికే టైటిల్ గెలిచిందని రాయుడు సెటైర్లు పేల్చాడు.
టైటిల్ గెలిచిందనే రోడ్లపై సంబరాలు..?
ఆర్‌సీబీ టైటిల్ గెలిచిందనే కదా.. ఆ జట్టు అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారని సెటైరికల్‌గా మాట్లాడాడు. వెంటనే వరుణ్ అరుణ్.. ఆర్‌సీబీ విజయాన్ని రాయుడు జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పాడు. అయినా రాయుడు వెనక్కి తగ్గకుండా సీఎస్‌కే గెలిచిన ఐదు ట్రోఫీల్లో ఒకటి ఆర్‌సీబీకి ఇచ్చిందని, దాంతో వారు బెంగళూరులో సంబరాలు చేసుకున్నాడని తెలిపాడు.
అంతేకాకుండా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. రాయుడి వ్యాఖ్యలపై ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.