ఐపీఎల్ 2024 సీజన్‌లో అంపైర్ల తప్పిదాలను తగ్గించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. స్మార్ట్ రిప్లే సిస్టమ్ ద్వారా క్రికెట్ టెక్నాలజీలో అప్‌గ్రేడ్ తీసుకురానుంది. అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్‌లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.
ఈ స్మార్ట్ రిప్లే సిస్టమ్ ద్వారా అంపైర్ల తప్పిదాలకు చెక్ పెట్టవచ్చు. అత్యంత వేగంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు అంపైర్లకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ప్రకారం.. క్రికెట్ టెక్నాలజీలో ఇది ఓ విప్లవమని చెప్పవచ్చు. ముఖ్యంగా మైదానంలో అంపైర్లు కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతోంది.

స్మార్ట్ రిప్లే సిస్టమ్ అంటే..?
స్మార్ట్ రిప్లే సిస్టమ్ ప్రకారం.. టీవీ అంపైర్ నేరుగా హాక్ ఐ ఆపరేటర్స్ ద్వారా ఇన్‌పుట్స్ తీసుకుంటాడు. మైదానం చుట్టూ పెట్టే ఎనిమిది హైస్పీడ్ హాక్ ఐ కెమెరాల నుంచి బ్రాడ్ కాస్టర్ డైరెక్టర్‌తో సంబంధం లేకుండా రీప్లేలను టీవీ అంపైర్ పరిశీలించవచ్చు. తద్వారా టీవీ అంపైర్‌కు కావాల్సిన సాక్ష్యాలను అత్యంత వేగంగా సేకరించే వీలు ఉంటుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న టెక్నాలజీ ప్రకారం టీవీ అంపైర్.. హాక్ ఐ ఆపరేటర్స్ మధ్య బ్రాడ్ కాస్ట్ డైరెక్టర్ ఉంటాడు. టీవీ అంపైర్‌కు కావాల్సిన యాంగిల్స్‌ను బ్రాడ్‌కాస్ట్ డైరెక్టర్‌ను కోరితే అతను హాక్‌ఐ ఆపరేటర్స్ సాయంతో అంపైర్‌కు అందిస్తాడు. అయితే స్మార్ట్ రిప్లే సిస్టమ్ ద్వారా బ్రాడ్‌కాస్టర్‌తో సంబంధం లేకుండానే హాక్ ఐ ఆపరేటర్స్ నుంచి కావాల్సిన యాంగిల్స్‌లో విజువల్స్‌ను టీవీ అంపైర్ తీసుకోవచ్చు.
ఈ పద్దతి ద్వారా చాలా వేగంగా స్ప్లిట్ స్క్రీన్ విజువల్స్ చూడవచ్చు. తద్వారా కచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం టీవీ అంపైర్‌కు లభిస్తోంది. స్టంపౌట్స్, రనౌట్స్, క్యాచెస్, ఎల్బీల విషయంలో ఈ టెక్నాలజీ అంపైర్లకు ఉపయోగకరంగా ఉండనుంది.