ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సత్తా చాటిన సన్‌రైజర్స్.. బ్యాటింగ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా(24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45), అజింక్యా రహానే(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్, షెహ్‌బాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాత్కత్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్‌రమ్‌తో పాటు ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీష్ తీక్షణ తలో వికెట్ తీయగా.. మోయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(31), అభిషేక్ శర్మ(37) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించిన అనంతరం అభిషేక్ శర్మ ఔటవ్వగా.. మూడు ఓవర్లలోనే హైదరాబాద్ 50 పరుగులు చేసింది.
క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్ చెలరేగాడు. ట్రావిస్ హెడ్ వెనుదిరిగినా.. ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అతను 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని మోయిన్ అలీ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్(10 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(14 నాటౌట్) సన్‌రైజర్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.