ఐపీఎల్ 2024 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ వరల్డ్ బెస్ట్ క్రికెట్ లీగ్‌కు తెరలేవనుంది. శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్లాన్ చేసింది. ఇప్పటికే చెన్నై వేదికగా ఈ ఆరంభ వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి.
గతేడాది మాదిరే బాలీవుడ్ స్టార్స్‌తో వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ఫ్రాఫ్, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్, నేపథ్య గాయకుడూ సోనూ నిగమ్ ఈ వేడుకల్లో పాల్గొని అభిమానులను అలరించనున్నారు. ఈ వివరాలను ఐపీఎల్ నిర్వాహకులు ఎక్స్‌వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

అయితే గతేడాది రష్మిక మంధాన, తమన్నా భాటియా వంటి సౌత్ హీరోయిన్స్ ఆరంభ వేడుకల్లో సందడి చేయగా.. ఈ సారి ఒక్క హీరోయిన్ కూడా లేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆరంభ వేడుకల్లో హీరోయిన్స్‌ను భాగం చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్స్ లేకుండా ఆరంభ వేడుకలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కోలివుడ్ సింగర్ అనిరుధ్ కావాలని కామెంట్ చేస్తున్నారు.
వేడుకలు ఎక్కడంటే..?
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీతో పాటు సెక్రటరీ జైషా, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తదితర బీసీసీఐ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
మ్యాచ్ టైమింగ్స్..
ఆరంభ వేడుకల నేపథ్యంలో తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి మాత్రం మధ్యాహ్నం జరిగే మ్యాచులు 3.30 గంటలకు.. రాత్రి జరిగే మ్యాచులు 7.30 గంటలకు మొదలవుతాయి.
ఫ్రీగా చూడాలంటే..
ఐపీఎల్ 2024 అధికారిక బ్రాడ్ కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్(టీవీ), జియో సినిమా(ఓటీటీ)లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టీవీలో మ్యాచులు చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు. స్టార్ స్టోర్స్ ఛానెల్‌ను సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. జియోసినిమాలో మాత్రం ఫ్రీగా మ్యాచ్‌లు చూడవచ్చు.