IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి చెన్నై సూపర్ కింగ్స్ సమయాత్తమవుతోంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా జట్టుకు భారంగా మారిన 8 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇందులో తెలుగు తేజం అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో ఏడుగురికి సీఎస్‌కే ఉద్వాసన పలికింది.
రూ. 16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన బెన్ స్టోక్స్.. అప్‌కమింగ్ సీజన్ ఆడనని సమాచారం ఇవ్వడంతో అతన్ని వేలంలోకి వదిలేసింది. బెన్ స్టోక్స్‌తో పాటు డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, అంబటి రాయుడు, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్, సిసండ మగలాలకు ఉద్వాసన పలికింది. దాదాపు తమ కోర్ టీమ్‌ను అలానే కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓ మిడిలార్డర్ బ్యాటర్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్, ఓవర్‌సీస్ పేసర్ లోటు ఉంది.
బెన్ స్టోక్స్ స్థానాన్ని రచిన్ రవీంద్ర లేదా ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లో ఒకరిని కొనుగోలు చేసి భర్తీ చేయాలనుకుంటోంది. గత సీజన్‌కు దూరంగా ఉన్న ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రూ. 2 కోట్ల కనీస ధరతో ఈ సారి వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వేలంలో ఈ ఇద్దరి కోసం ఫ్రాంచైజీలు తెగ పోటీ పడే అవకాశం ఉంది. ప్రపంచకప్ కూడా గెలవడంతో ఈ ఇద్దరికీ ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఇద్దరూ భారీ ధర పలికే అవకాశం ఉంది. కేకేఆర్ తరఫున ఇప్పటికే తన సత్తా ఏంటో చూపించిన ప్యాట్ కమిన్స్.. లోయరార్డర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో కూడా చెలరేగగలడు. అతని అనుభవంతో పాటు ఆల్‌రౌండ్ స్కిల్స్, కెప్టెన్సీ సామర్థ్యం జట్లకు కలిసి రానున్నాయి.
గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ పేస్ బౌలింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తేలిపోయింది. ఆ సమస్యను అధిగమించేందుకే సీఎస్‌కే కమిన్స్‌ను టార్గెట్ చేసింది. బెన్ స్టోక్స్ కోసం ఖర్చు చేసిన 16.25 కోట్లను అతని కోసమే ఉపయోగించాలనుకుంటోంది. అతను దొరక్కపోతే.. స్టార్క్ కోసం ప్రయత్నించనుంది.
అప్పుడెప్పుడో ఆర్‌సీబీకి ఆడిన స్టార్క్.. సుదీర్ఘ కాలంగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. కానీ టీ20 ఫార్మాట్‌లో అతనికి మెరుగైన గణంకాలు ఉండటంతో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ఈ క్రమంలోనే కమిన్స్ దొరకకపోతే.. స్టార్క్‌ను తీసుకోవాలని చెన్నై భావిస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2024 సీజన్ ఆడనుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన రచిన్ రవీంద్ర రూ. 50 లక్షల కనీస ధరతో వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. అతని కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. అయితే మొయిన్ అలీ, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజాలు ఉన్న నేపథ్యంలో సీఎస్‌కే రచిన్ రవీంద్రను తీసుకోకపోవచ్చు.