జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అదిరిపోయే విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ.. 112 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ భారీ విజయంతో రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్న ఆర్‌సీబీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సులువు చేసుకుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోనుంది.
నెగటీవ్‌లో ఉన్న ఆర్‌సీబీ రన్‌రేట్ ఈ విజయంతో పాజిటివ్‌గా మారింది. మరోవైపు ఘోర పరాజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పేలవ బ్యాటింగ్ ఆ జట్టు కొంపముంచింది. ముఖ్యంగా ఆ జట్టు స్లార్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ డకౌటవ్వడం రాజస్థాన్ పతనాన్ని శాసించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివర్లో అనూజ్ రావత్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడమ్ జంపా, కేఎమ్ ఆసిఫ్ రెండే వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. షిమ్రాన్ హెట్‌మైర్(19 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 35) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్(3/10) మూడు వికెట్లతో చెలరేగగా.. మైఖెల్ బ్రేస్‌వెల్(2/16), కర్ణ్ శర్మ(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు.
సిరాజ్, మ్యాక్స్‌వెల్‌కు ఓ వికెట్ దక్కింది. ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యల్ప తక్కువ స్కోర్‌కు ఆలౌటైన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో ఇదే లోయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం.
లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగింది. పార్నెల్ వేసిన మరుసటి ఓవర్‌లో జోస్ బట్లర్(0), సంజూ శాంసన్ వెనుదిరగ్గా.. మైఖేల్ బ్రేస్‌వెల్ దేవదత్ పడిక్కల్(4)ను ఔట్ చేశాడు. నిలకడగా ఆడే ప్రయత్నం చేసిన జోరూట్(10)ను పార్నెల్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది.
ఆ వెంటనే ధృవ్ జురెల్(0) మైఖేల్ బ్రేస్‌వెల్ ఔట్ చేయగా.. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్‌మైర్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. కానీ అదే ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్(0) రనౌట్‌గా వెనుదిరిగాడంతో రాజస్థాన్ ఓటమి ఖారారు అయ్యింది. దూకుడు కనబర్చిన హెట్‌మైర్‌కు మ్యాక్స్‌వెల్ కళ్లెం వేయగా.. ఆడమ్ జంపా(2), కేఎమ్ ఆసిఫ్(0)లను కర్ణ్ శర్మ పెవిలియన్ చేర్చి ఆర్‌సీబీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.