హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత దారుణంగా విఫలమైంది. మరోసారి పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో అభిమానులను తలెత్తుకోకుండా చేసింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది అత్యంత చెత్త ప్రదర్శన.
గతేడాది 14 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 8వ స్థానంలో నిలిచి కాస్త గౌరవం కాపాడుకున్న హైదరాబాద్ ఈ సారి మరీ దారుణంగా విఫలమైంది. టీమ్ మొత్తాన్ని ప్రక్షాళన చేసినా.. కెప్టెన్‌తో పాటు హెడ్ కోచ్‌ను మార్చినా.. కోట్లు పెట్టి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మాత్రం మారలేదు.

కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు సన్‌రైజర్స్‌ను నట్టేట ముంచేసారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కోసం సన్‌రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా.. అతను 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఇందులో ఓ సెంచరీ ఉండటం విశేషం. మూడు ఇన్నింగ్స్‌ల్లో డకౌటైన హ్యారీ బ్రూక్.. 6 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు.
ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్‌తో పాటు జట్టుకు భారంగా మారిన ఓవర్‌సీస్ ఆటగాళ్లను వదులుకునేందుకు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సిద్దమైంది. ముఖ్యంగా టీమ్ ఓనర్ కావ్య మారన్ ఈ సీజన్ ఓటమిని చాలా అవమానకరంగా భావించినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. హ్యారీ బ్రూక్‌తో పాటు గ్లేన్ ఫిలిప్స్, ఫజలక్ ఫరూకీ, అకీల హోస్సెన్, మార్కో జాన్సెన్‌లను వదిలేయాలని కావ్య మారన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కోచింగ్ స్టాఫ్‌ను కూడా మార్చే యోచనలో కావ్య మారన్ ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ బ్రియాన్ లారాతో పాటు బౌలింగ్ కోచ్ డెయిల్ స్టెయిన్‌లపై వేటు వేసి భారత మాజీ ఆటగాళ్లకు ఆ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో కావ్య మారన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సంబంధించిన అధికారులు భారత కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టారని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.