హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ చెత్త ప్రదర్శన కనబర్చి అభిమానులను నిరాశపరిచింది. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన సన్‌రైజర్స్.. పాయింట్స్ టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది అత్యంత చెత్త ప్రదర్శన.
గతేడాది 14 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 8వ స్థానంలో నిలిచి కాస్త గౌరవం కాపాడుకున్న హైదరాబాద్ ఈ సారి మరీ దారుణంగా విఫలమైంది. టీమ్ మొత్తాన్ని ప్రక్షాళన చేసినా.. కెప్టెన్‌తో పాటు హెడ్ కోచ్‌ను మార్చినా.. కోట్లు పెట్టి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మాత్రం మారలేదు.

కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు పేలవ ఆటతీరుతో సన్‌రైజర్స్‌ను నట్టేట ముంచేసారు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కోసం సన్‌రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా.. అతను 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. అతని తర్వాత రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన భారత స్టార్ బ్యాటర్ మనీశ్ పాండే కూడా సన్‌రైజర్స్ పరాజయాలకు కారణమయ్యాడు.
ఎంతో నమ్మకం పెట్టుకున్న రాహుల్ త్రిపాఠి కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ శర్మ ఒకటి రెండు మ్యాచ్‌లు పర్వాలేదనిపించినా.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. రూ.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన వాషింగ్టన్ సుందర్ చెత్త ప్రదర్శనతో పాటు ఆట మధ్యలోనే వైదొలిగాడు. యువ ప్లేయర్లు ఉమ్రాన్ మాలిక్‌తో పాటు నటరాజన్, నితీశ్ కుమార్ రెడ్డిలు కూడా దారుణంగా విఫలమయ్యారు.
ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, నితీశ్ కుమార్ రెడ్డిలను వదులుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు అయిన హ్యారీ బ్రూక్, గ్లేన్ ఫిలిప్స్, ఫజలక్ ఫరూకీ, అకీల హోస్సెన్, మార్కో జాన్సెన్‌లను వదిలేయాలని టీమ్ ఓనర్ కావ్య మారన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ 10 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 270 రన్స్ చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లే ఆడిన సుందర్ 60 పరుగులతో పాటు మూడు వికెట్లు మాత్రమే తీసాడు. గతేడాది కూడా అతను 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లే ఆడిన ఉమ్రాన్ మాలిక్ 5 వికెట్లు మాత్రమే తీసాడు. 10.85 ఎకానమీతో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఆటగాళ్లను వదులుకునేందుకు సన్‌రైజర్స్ సిద్దమైనట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.