హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమిపాలైంది. మొత్తం 7 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. వరుసగా రెండు పరాజయాలతో లీగ్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత రెండు విజయాలతో జోరు కనబర్చి అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడింటిలోనూ ఓటమిపాలై ఆభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ బ్యాటింగ్‌తో 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అభిమానులు టీమ్‌మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. ముఖ్యంగా టీమ్ ఓనర్ కావ్య మారన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పనికిరాని ఎర్నీ బ్రూక్ అలియాస్ హ్యారీ బ్రూక్‌కు రూ.13.25 కోట్లు అనవసరంగా పెట్టారని, అతని కంటే రూ.50 లక్షలు పెట్టి రహానేను తీసుకున్నా సరిపోయేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం గెలిచే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోవడానికి జట్టుకు ఉన్న దోషమే కారణమని సెటైర్లు పేల్చుతున్నారు. వెంటనే దోష నివారణ పూజలు చేయించాలని కావ్య మారన్‌కు సూచిస్తున్నారు.
నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ మైదానంలో ఆడుతున్న సన్‌రైజర్స్‌కు కలిసిరావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ మూడింటిలో ఓడిపోయిందని, పంజాబ్‌తో మాత్రమే గెలిచిందని గుర్తు చేస్తున్నారు. ఉప్పల్ మైదానంలో వాస్తు దోషం ఉందని, దాని నివారణకు కూడా పూజలు చేయించాలని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మలు జట్టుకు శనిలా దాపురించారని మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(34 బంతుల్లో 4 ఫోర్లతో 34), మనీశ్ పాండే(27 బంతుల్లో 2 ఫోర్లతో 34) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీయగా.. భువీ రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలైంది. మయాంక్ అగర్వాల్(39 బంతుల్లో 7 ఫోర్లతో 49), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), వాషింగ్టన్ సుందర్(15 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.