హైదరాబాద్: అభిమానం హద్దులు ధాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులు కొందరు ఓటమిని తట్టుకోలేక జుగుప్సాకరమైన ట్రోలింగ్‌కు దిగారు. తమ ఆటగాళ్లను కాకుండా అసాధారణ ప్రదర్శన కనబర్చిన ప్రత్యర్థి ఆటగాడిని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. అతని చావును కోరడమే కాకుండా కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన రీతిలో కామెంట్ చేశారు.
కోహ్లీ అభిమానుల పేరిట సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్న ఈ సైకోల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండా ఆర్‌సీబీ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఆర్‌సీబీ టోర్నీ నిష్క్రమించగా.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ ( 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101 నాటౌట్) సూపర్ సెంచరీతో 198 పరుగుల పోరాడే లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది. ఈ భారీ స్కోర్, చిన్నస్వామి స్టేడియం రికార్డుల నేపథ్యంలో ఆర్‌సీబీ విజయం ఖాయమని అంతా భావించారు.
అందుకు తగ్గట్లుగానే ఆర్‌సీబీ శుభారంభం అందుకుంది. ఆదిలోనే ఓపెనర్ సాహాను పెవిలియన్ చేర్చింది. కానీ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ సెంచరీతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ సైతం శుభ్‌మన్ గిల్‌ను త్వరగా ఔట్ చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని చెప్పాడు.
శుభ్‌మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్‌ను తట్టుకోలేకపోయిన కొంతమంది సైకో ఫ్యాన్స్.. అతన్ని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్, అతని సోదరి షానీల్ గిల్ పై రాయలేని పదాలతో దూషణలకు దిగారు. ఓ కారు యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. 'ఈ కారులో గిల్ ఉంటే బాగుండు', 'కారు ప్రమాదంలో గిల్ మృతి' అని కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందారు.
'శుభ్‌మన్ గిల్.. నువ్వు, నీ ట్రాన్స్‌జెండర్ సోదరి తలలు తెగిపడాలి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో.. నీ జీవితంలో అన్నీ అపశకునాలే. ఆ మేరకు నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. నీ కంట్లోంచి కారే ప్రతి కన్నీటి బొట్టుకు నా శాపమే కారణం.'అని శాపనార్థాలు పెట్టారు. షానీల్ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోల కింద దారుణమైన కామెంట్స్ చేశారు.
షానీల్ గిల్ బికీనీ వేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. 'ఖలిస్తాని ఉగ్రవాది'అని దూషించారు. 'షానీల్ గిల్ ఆర్సీబీ బౌలర్లతో బెడ్ పంచుకుంది. అందుకే గిల్ సెంచరీ చేశాడు.'అని దారుణంగా తిట్టారు. ఈ ట్వీట్లను ఆర్‌సీబీ అభిమానులే తప్పుబడుతున్నారు. శుభ్‌మన్ గిల్‌ను తిట్టడం దారుణమని, ఇది సైకోయిజమని మండిపడుతున్నారు.