
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 మినీ వేలానికి రంగం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో(డిసెంబర్ 23) ఈ మెగా ఆక్షన్‌కు తెరలేవనుంది. కేరళలోని కొచ్చి వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ఆటగాళ్ల వేలం ప్రారంభమవుతుందని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. మొత్తం 991 మంది ఆటగాళ్లు మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.
ఇందులో 30 స్లాట్స్ ఓవర్‌సీస్ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు. మినీ వేలానికి టైమ్ దగ్గరపడుతున్నా కొద్దీ ఫ్రాంచైజీల వ్యూహాలు, టీమ్స్ కొనుగోలు చేసే ఆటగాళ్ల ప్రిడిక్షన్స్ జోరు అందుకున్నాయి.

ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను కొనుగోలు చేసే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. మినీ వేలంలో బౌలర్లపైనే ప్రధానం దృష్టి పెడుతుందని జోస్యం చెప్పాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన మంజ్రేకర్.. ముంబై ఇండియన్స్ రషీద్ ఖాన్, సునీల్ నరైన్ వంటి బౌలర్ల కోసం ఎదురు చూస్తుందని తెలిపాడు.
'గత సీజన్‌లో సరైన బౌలింగ్ దాడి లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ చాలా ఇబ్బంది పడింది. అయితే ఈసారి బుమ్రాతోపాటు జొఫ్రా ఆర్చర్ కూడా వచ్చేస్తాడు. అలాగే జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ కూడా ఉండటం పేస్ బౌలింగ్ పటిష్టంగా అనిపిస్తోంది. రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ప్రతీ ఫ్రాంచైజీ కూడా రషీద్ ఖాన్ లాంటి లెగ్ స్పిన్నర్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపుతోంది. కాబట్టి ముంబై కూడా ఇలానే ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే జట్టులో మార్కండే ఉన్నప్పటికీ.. జంపా, అదిల్ రషీద్ వంటి అంతర్జాతీయ స్పిన్నర్‌ను తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ ప్రయత్నించవచ్చు'' అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.