
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా అమలు చేయనున్న నయా రూల్స్ తనకు బాగా నచ్చాయని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma) అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు టాస్ పడిన తర్వాత తుది జట్లను ప్రకటించడం బాగుందన్న రోహిత్.. ఈ నిబంధనలతో లీగ్ మరింత రసవత్తరంగా సాగనుందన్నాడు. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
వైడ్, నోబాల్‌కు రివ్యూ, టాస్ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్ ప్లేయర్.. ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ సీజన్‌లో ప్రవేశ పెట్టబోతుంది. లీగ్ ప్రారంభానికి ముందే 'ఇంపాక్ట్ ప్లేయర్'రూల్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్‌రౌండర్లకు ఆదరణ తగ్గుతుందని కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా.. ఈ రూల్‌తో భారత ఆటగాళ్లకు మేలు జరగనుందని మరికొందరు అంటున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. ఈ నిబంధనపై స్పందించాడు. తనకు బాగా నచ్చిందని చెప్పాడు.
'గత 10 ఏళ్లుగా ముంబై ఇండియన్స్‌కు ఆడటం చాలా ప్రత్యేకం. ముంబై ఇండియన్స్ జట్టుతో నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను. మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. ధోనీ సునాయసంగా మరో మూడేళ్ల పాటు ఐపీఎల్ ఆడగలడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్రవేశపెట్టబోతున్న నయా రూల్స్ నాకు బాగా నచ్చాయి. ఈ సీజన్ ఫార్మాట్ ఐడియా కూడా నాకు బాగా నచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు టాస్ తర్వాత జట్లను ప్రకటించడం అనే నిబంధనలు బాగున్నాయి.
ఈ రూల్స్‌తో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మేం తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ జట్టు ఎలా ఆడుతుందో మాకు బాగా తెలుసు. దానికి తగ్గ 12 మంది సరైన ఆటగాళ్లను మేం మైదానంలోకి దింపుతాం. గాయంతో జట్టుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు చర్చలు చేస్తున్నాం. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తాం.
బుమ్రాలేని లోటును తీర్చే కొందరు ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. వారిపై కూడా మేం ఓ కన్నేసాం. బుమ్రా లేని లోటును వారు భర్తీ చేస్తారని ఆశిస్తున్నాం. బుమ్రా గైర్హాజరీ ఫ్రాంచైజీకి పెద్దలోటే. కానీ యువ ఆటగాళ్లకు ఇదో సువర్ణవకాశం. అదేవిధంగా కుర్రాళ్లపై అనవసర ఒత్తిడి పెంచాలని నేను అనుకోవడం లేదు. జట్టులోని ఆటగాళ్లకు ఎవరీ బాధ్యతలు ఏంటనే విషయం బాగా తెలుసు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడని ఆటగాళ్లకు టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా ఉంటుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.