
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ పృథ్వీ షాపై ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో అసలు సిసలు పృథ్వీ షాను చూస్తారని ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. మెరుగైన ప్రదర్శన చేసేందుకు పృథ్వీ షా ఎంతగానో కష్టపడుతున్నాడని, అతను చాలా కొత్తగా కనిపిస్తున్నాడని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రికీ పాంటింగ్.. ఈ సారి ఆరెంజ్ క్యాప్ రేసులో పృథ్వీ షా ముందుంటాడని జోస్యం చెప్పాడు. ఈ సీజన్ అతని కెరీర్‌కు బ్రేక్ త్రూగా నిలుస్తుందన్నాడు.
'ఐపీఎల్ 2023 సీజన్ కోసం పృథ్వీ షా చాలా కష్టపడుతున్నాడు. అందరి కంటే ముందుగానే టీమ్ ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరాడు. ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుని నేరుగా ఇక్కడికి వచ్చాడు. తన ఆటను మెరుగుపర్చుకోవడానికి పృథ్వీ షా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పృథ్వీ షా ఇంత పవర్‌ఫుల్‌గా ఉండటం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఫిట్‌నెస్‌పైన కూడా అతను చాలా ఫోకస్ పెట్టాడు. అతనిలో వచ్చిన మార్పు చాలా సంతోషాన్నిచ్చింది.
ఇతర ఆటగాళ్లతో పోలిస్తే పృథ్వీ షా చాలా విభిన్నమైన ఆటగాడు. అతని టాలెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. అయితే అతనితో వచ్చిన సమస్యల్లా ఒక్కడే బాగా ఆడితే నెట్స్‌లో గంటలు కొద్దీ ప్రాక్టీస్ చేస్తాడు... లేకపోతే అస్సలు చేయడు. ఇప్పుడు అతనిలో చాలా మార్పు వచ్చింది. ఓపిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మిగిలిన ఆటగాళ్లతో బాగా కలిసి పోతున్నాడు. సోమరిగా ఉండే వారంటే నాకు అస్సలు నచ్చదు. పృథ్వీ షాలో ఎంత టాలెంట్ ఉన్నా.. బద్ధకంతో దాన్ని వృథా చేసుకునేవాడు. ఇప్పుడు అతనిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
సరిగ్గా చెప్పాలంటే ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసులో పృథ్వీ షా ఉంటాడు. నా అంచనా నిజమైతే ఈసారి అతనే ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు. ప్రతీ సెషన్‌లోనూ ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. దానికి ఫలితం ఐపీఎల్‌లో కనిపిస్తుంది. తనకే సాధ్యమైన ఆటతీరు పృథ్వీ షా ప్రత్యర్థులపై చెలరేగుతాడు.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో ఇప్పటి ఇవరకు 68 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా 147.25 స్ట్రైక్ రేట్‌తో 1588 పరుగులు చేశాడు. గత సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన పృథ్వీ 283 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ గైర్హజరీతో బలహీనంగా మారిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షా చెలరేగితే తిరుగుండదు.