
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రపంచంలోని అత్యంత గొప్ప టీ20 లీగ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఒక్కసారి అయిన ఐపీఎల్ ఆడాలని కలలు కంటుంటారు. 2008లో ప్రారంభమైన ఈ ధనాధన్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ లీగ్ వాల్యూ కూడా పెరుగుతూనే ఉంది. ఓవైపు ఐపీఎల్ 2023 మెగా వేలానికి ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ఈ క్యాష్ రిచ్ లీగ్ వాల్యూకు సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 మినీ వేలం జరగనుంది.
మొత్తం 991 మంది ఆటగాళ్లు మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఇందులో 30 స్లాట్స్ ఓవర్‌సీస్ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల కోసం భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు.
అయితే వచ్చే సీజన్ ప్రారంభానికి ముందే ఐపీఎల్ విలువ రూ. 91 వేల కోట్లకు (11 బిలియన్ల అమెరికా డాలర్లు) చేరిందని బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఐపీఎల్ విలువ 6.2 బిలియన్లుగా ఉండగా.. ప్రస్తుతం రెట్టింపు అయ్యింది. కరోనాతో లీగ్‌కు మూడేళ్ల పాటు ఆటంకం కలిగిన బ్రాండ్ వాల్యూ మాత్రం ఏం తగ్గలేదు. కొత్తగా రెండు జట్లను జత చేయడంతో పాటు ఐపీఎల్ మీడియా రైట్స్ భారీ ధరకు అమ్మడం క్యాష్ రిచ్ లీగ్ విలువను అమాంతం పెంచేసింది.
2023 నుంచి 2027 సైకిల్‌కు సంబంధించిన ఐపీఎల్ మీడియా రైట్స్‌ను భారీ ధరకు అమ్మిన బీసీసీఐ.. తొలి సారి టీవీ, ఓటీటీ రైట్స్‌ను విభజించింది. దాంతో టీవీ రైట్స్‌ను స్టార్ స్పోర్ట్స్ రూ.23,575 కోట్లకు కొనుగోలు చేయగా.. వయాకమ్ 18 డిజిటల్ రైట్స్‌ను రూ.23578 కోట్లకు తీసుకుంది. కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ద్వారా 1.6 బిలియన్ డాలర్ల ఆదాయం బీసీసీఐకి వచ్చింది. అంతేకాకుండా మ్యాచ్‌ల సంఖ్యను రెట్టింపు చేయడం కూడా బ్రాండ్ వాల్యూను పెంచింది. ఈ సారి పాత పద్దతిలో సొంతమైదానాల్లో ఫ్రాంచైజీలు మ్యాచ్‌లు ఆడనుండటం.. టికెట్ రెవెన్యూ కూడా వచ్చే అవకాశం ఉండటం కూడా ఐపీఎల్ విలువను అమాంతం పెంచేసింది.