హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు కలిసిరాలేదు. మరోసారి టైటిల్ గెలవకుండానే ఆర్‌సీబీ అభిమానులను నిరాశపరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగినా ఆర్‌సీబీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
14 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఆర్‌సీబీ పూర్తిగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లపైనే ఆధారపడింది. బ్యాటింగ్ భారాన్ని మోత్తం కేజీఎఫ్ మోయగా.. బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. దాంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా ఆర్‌సీబీ కోల్పోయింది.

గాయాల బెడదతో పాటు దినేశ్ కార్తీక్ వంటి సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ టీమ్ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం పకడ్బందీ ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు ఆ జట్టు సిద్దమైంది. ముఖ్యంగా పేలవ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లపై వేటు వేయనుంది.
దినేశ్ కార్తీక్: గత సీజన్‌లో ఫినిషర్ పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. 11.67 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు. వయసు కూడా పై బడటంతో దినేశ్ కార్తీక్‌ను పక్కనపెట్టేందుకు ఆర్‌సీబీ సిద్దమవుతోంది.
ఆకాశ్ దీప్: బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌కూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓవర్‌కు 11.8 చొప్పున పరుగులు ఇచ్చుకున్నాడు. అతని స్థానంలో విజయ్ కుమార్ వైశాఖ్ సత్తా చాటడంతో ఆకాశ్ దీప్‌ను వదులుకునేందుకు ఆర్‌సీబీ రెడీ అవుతోంది.
సిద్దార్థ్ కౌల్: ఎక్స్‌ట్రా పేసర్ జట్టులోకి తీసుకున్న సిద్దార్థ్ కౌల్‌కు ఈ సీజన్‌లో ఒక్క అవకాశం కూడా దక్కలేదు. బ్యాకప్‌గా అతన్ని తీసుకున్న ఆర్‌సీబీ.. ఇప్పుడు వదులుకోవాలనుకుంటోంది.
కేదార్ జాదవ్: అనుభవం కలిగిన మిడిలార్డర్ బ్యాటర్ కావాలనే ఉద్దేశంతో సీజన్ మధ్యలో కేదార్ జాదవ్‌ను తీసుకున్న ఆర్‌సీబీ.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కేదార్ జాదవ్ 12 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ అతనికి గుడ్‌బై చెప్పనుంది.

షెహ్‌బాజ్ అహ్మద్: గత సీజన్‌లో పర్వాలేదనిపించిన షెహ్‌బాజ్ అహ్మద్ ఈసారి దారుణంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో 42 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే అతనిపై వేటు వేసేందుకు ఆర్‌సీబీ రెడీ అయ్యింది.