హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం సొంత మైదానంలో అమీతుమీ తేల్చుకోనుంది. పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయాన్నందుకు ఆర్‌సీబీ అదే జోరులో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాలనుకుంటోంది. గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనుంది.
పర్యావరణ పరీరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఆర్‌సీబీ గత 11 ఏళ్లుగా కృషి చేస్తోంది. 2011 సీజన్ నుంచి ప్రతీ ఏడాది ఒక మ్యాచ్‌ను గ్రో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ జెర్సీలతో ఆడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా టాస్ సందర్భంగా ప్రత్యర్థి జట్టుకు ఓ మొక్కను బహుమతిగా అందజేస్తోంది.

మూడు సీజన్ల తర్వాత సొంతమైదానంలో ఆర్‌సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగుతోంది. 100 శాతం రిసైక్లింగ్ చేసిన జెర్సీలనే ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో ధరించనుంది. అయితే ఈ గ్రీన్ జెర్సీలతో ఆడిన మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి మంచి రికార్డు లేకపోవడం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది.
ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఒక మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. 2011లో కొచ్చి టస్కర్స్‌తో జరిగిన తొలి గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2012లో ముంబై ఇండియన్స్‌తో 5 వికెట్ల తేడాతో ఓడిన ఆర్‌సీబీ, 2013లో పంజాబ్‌తో 2014లో చెన్నైతో ఓటమిపాలైంది.
2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వగా.. 2016 సీజన్‌లో గుజరాత్ లయన్స్‌పై 144 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 2017లో కేకేఆర్ చేతిలో ఓడిన ఆర్‌సీబీ 2018లో రాజస్థాన్, 2019లో ఢిల్లీ క్యాపిటల్స్, 2020లో సీఎస్‌కే, 2021లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది.
గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలుపొందింది. రేపు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుస్తుందా? లేక ఓటమిపాలవుతుందా? అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.