హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కీలక పోరుకు సిద్దమైంది. గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలుంటాయి. ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నామమాత్రపు మ్యాచ్. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆ జట్టు తమతో పాటు ఆర్‌సీబీని తీసుకెళ్లాలనుకుంటోంది. గత మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌పై 112 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. నెట్ రన్ రేట్‌ను -0.344 నుచి 0.166గా మార్చుకుంది. రాజస్థాన్‌ను వెనక్కునెట్టి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.

అదే జోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఆర్‌సీబీలో ఫాఫ్ డుప్లెస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. గత రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ విఫలమయ్యాడు. అతను కూడా గాడిన పడితే ఆ జట్టు బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇప్పటికే ఫాఫ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కాగా.. బౌలింగ్‌లో సిరాజ్ సత్తా చాటుతున్నాడు.
లోకల్ భాయ్ సిరాజ్.. రేపటి మ్యాచ్‌లో సత్తా చాటితే ఆర్‌సీబీకి తిరుగుండదు. ఈ ఏడాది ఉప్పల్‌లో ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అదే జోరును కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు తిప్పలు తప్పవు. గత మ్యాచ్‌తో అనూజ్ రావత్ కూడా టచ్‌లోకి వచ్చాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది.
హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఒకవైపు బౌండరీ చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు పండుగ చేసుకోనున్నారు. ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్‌ను ఉంచితే హైదరాబాద్‌ను ఓడించవచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే ఇక్కడ ఎక్కువ విజయాలు సాధించాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.
గత మ్యాచ్‌కు దూరమైన వానిందు హసరంగా, హజెల్ వుడ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోనున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించాలంటే కేజీఎఫ్(కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) చెలరేగాల్సిందే.
హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా):
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, మైఖేల్ బ్రేస్‌వెల్, అనూజ్ రావత్, వ్యాన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్: షెహ్‌బాజ్ అహ్మద్/ విజయ్ కుమార్ వైశాఖ్.