హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా విఫలమైంది. గతేడాది అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఈ సారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది.
టోర్నీ ఆసాంతం యశస్వీ జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చేలరేగినా.. కీలక సమయంలో జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్‌మైర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ ఫామ్ కోల్పోవడం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది

టోర్నీ ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో పాయింట్స్ టేబల్‌లో టాప్-3లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. సెకండాఫ్‌లో మాత్రం వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి ఏడు ఓడిన రాజస్థాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. నిలకడలేమి ఆటతీరు ఆ జట్టు కొంపముంచింది.
ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ సిద్దమైంది. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్‌లో జరుగనున్న మినీ వేలానికి రాజస్థాన్ రాయల్స్ బ్లూ ప్రింట్ సిద్దం చేసుకుంటోంది. ముఖ్యంగా ముగ్గురు విదేశీ ఆటగాళ్లను వదులుకునేందుకు రాజస్థాన్ సిద్దమైంది.

1. ఆడమ్ జంపా
రూ. కోటీ 50 లక్షలకు కొనుగోలు చేసిన ఆడమ్ జంపాను వదులుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దమవుతోంది. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ రాణిస్తుండటంతో ఆడమ్ జంపాకు తుది జట్టులో చోటు దక్కడం లేదు. బ్యాకప్ స్పిన్నర్‌గా తీసుకున్నా.. ఓవర్‌సీస్ కాంబినేషన్ నేపథ్యంలో అతన్ని ఆడించే పరిస్థితి నెలకొంది.

2. జోరూట్..
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ సన్నదత కోసం ఎన్నడూ ఐపీఎల్ ఆడని జోరూట్ ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. జోస్ బట్లర్ ప్రోద్బలంతో రాజస్థాన్ అతన్ని తీసుకొని అవకాశం కల్పించినా.. అతను రాణించలేకపోయాడు. మొత్తం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 10 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదులుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దమవుతోంది.

3. జాసన్ హోల్డర్
ఐపీఎల్ 2023 సీజన్‌లో జాసన్ హోల్డర్ దారుణంగా విఫలమయ్యాడు. అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. 8 మ్యాచ్‌లు ఆడిన 11 పరుగులు మాత్రమే చేసిన హోల్డర్.. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసాడు. ఈ పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు.