హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో 112 పరుగుల భారీ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివర్లో అనూజ్ రావత్(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆడమ్ జంపా, కేఎమ్ ఆసిఫ్ రెండే వికెట్లు తీయగా.. సందీప్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. షిమ్రాన్ హెట్‌మైర్(19 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 35) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్(3/10) మూడు వికెట్లతో చెలరేగగా.. మైఖెల్ బ్రేస్‌వెల్(2/16), కర్ణ్ శర్మ(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు.రాయల్స్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది.
ఈ భారీ విజయంతో ఆర్‌సీబీ రన్‌రేట్‌తో పాటు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ముంబై చేతిలో ఓటమి తర్వాత ఆర్‌సీబీ రన్‌రేట్(-0.3) నెగటీవ్‌గా మారగా.. రాజస్థాన్ విజయానంతరం +0.166కు చేరింది. పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. ఇంతటి భారీ విజయం సాధించినా.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఇతర జట్లు ఓటమిపాలవ్వాలి.
ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో(మే18), అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మే 21న ఆడనుంది. ఈ రెండింటిలో విజయం సాధిస్తే 16 పాయింట్లతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం దక్కుతుంది. అయితే 12 పాయింట్లతోనే ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఓడాలి. అంతేకాకుండా నాలుగో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవాలి. అప్పుడే ఆర్‌సీబీకి నాలుగో ప్లేస్ ఖరారు అవుతోంది.
ఆర్‌సీబీకి టాప్-2 చేరే అవకాశం కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడి ఆర్‌సీబీ భారీ విజయాలందుకొని మెరుగైన రన్ రేట్ సాధిస్తే టాప్-2కు చేరవచ్చు. ఇక టాప్-2లో నిలిచిన జట్టుకు క్వాలిఫయర్-1, 2 ఆడే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.