హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రతీ జట్టు 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ప్రతీ జట్టు మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. లీగ్ దశ ముగింపునకు చేరినా.. ప్లే ఆఫ్స్ చేరే జట్ల విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పటికీ 10 జట్లు టెక్నికల్‌గా రేసులోనే ఉన్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..:11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించిన ఆ జట్టు చివరి మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశం లేదు. ఆ జట్టుకు 2 శాతం మాత్రమే ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలున్నాయి. అద్భుతం జరిగి మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ భారీ విజయం సాధించి.. ఇతర జట్లు చిత్తుగా ఓడితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేదు.

గుజరాత్ బెర్త్ ఖాయం..:8 విజయాలతో 16 పాయింట్లతో టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖారారు అయ్యింది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌కు వచ్చే డోకాలేదు. ప్లే ఆఫ్స్ చేరడానికి గుజరాత్‌కు 96 శాతం అవకాశాలుండగా.. క్వాలిఫైయర్ 1కు క్వాలిఫై అయ్యేందుకు 92 శాతం అవకాశం ఉంది.
సీఎస్‌కే కూడా..:12 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆ జట్టుకు తిరుగుండదు. రెండింటికి రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ధోనీసేన తదుపరి దశకు చేరుకునే అవకాశాలు 98 శాతంగా ఉండగా.. క్వాలిఫైయర్ 1కు అర్హత సాధించే అవకాశాలు 70 శాతం ఉన్నాయి.
ముంబైకి తిరుగులేదు..:11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగతా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే నాకౌట్ దశకు అర్హత సాధిస్తుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లోనే గెలిస్తే మాత్రం భారీ విజయాలు సాధించాలి. ముంబై ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 61 శాతం ఉన్నాయి.
ఆర్‌సీబీ డౌట్..:11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ తప్పకుండా గెలవాల్సిందే. అది కూడా భారీ విజయాలతో రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటి ముఖం పట్టాల్సిందే.
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు 22 శాతం మాత్రమే ఉన్నాయి.

డేంజరస్‌గా హైదరాబాద్..:10 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ డేంజరస్‌గా మారింది. లక్నో, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల భవితవ్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఉంది. ఈ మూడు జట్లతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా హైదరాబాద్ ఓడిస్తే ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరకున్నా.. ఇతర జట్ల ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆ జట్టు చేతిలో ఉంది.
11 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న లక్నో, 10 పాయింట్లతో 5, 6, 8 స్థానాల్లో కొనసాగుతున్న రాజస్థాన్, కేకేఆర్, పంజాబ్ కూడా మిగతా మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవుతాయి. లక్నోకు 44 శాతం, రాజస్థాన్‌కు 25 శాతం, పంజాబ్‌కు 14 శాతం ప్లే ఆఫ్స్ చేరే చాన్సెసె ఉన్నాయి.