న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యంత దుమారం రేపిన ఘటన ఏదైనా ఉందా? అంటే అది విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ గొడవే. ఈ ఘటన జరిగి మూడు రోజులు పూర్తవుతున్నా.. ఇంకా ఈ గొడవపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి.
ముందుగా ఈ గొడవకు ఆజ్యం పోసింది గౌతమ్ గంభీరేనని అంతా అభిప్రాయపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో గంభీర్ అత్యుత్సాహం ప్రదర్శించాడని, ఒక్క పరుగుతో గెలిచిన అనంతరం ఆర్‌సీబీ అభిమానులు గమ్మున ఉండాలని సైగలు చేయడం ఈ మాటల యుద్దానికి కారణమైందని కామెంట్ చేశారు.

గంభీర్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ట్విటర్ వేదికగా ఆర్‌సీబీ ఆటతీరును విమర్శించి కయ్యానికి కాలు దువ్విందని పేర్కొన్నారు. లక్నో అత్యుత్సాహంతోనే ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ దూకుడుగా వ్యవహరించిందని సమర్థించారు. ఆ తర్వాత లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్‌కు కోహ్లీ షూ చూపిస్తున్న వీడియో ఒకటి వైరల్ కావడంతో అభిమానులు యూటర్న్ తీసుకున్నారు.
గంభీర్ ఎంత రెచ్చగొట్టినా.. నవీన్ ఉల్ హక్ తప్పుగా మాట్లాడినా సహచర ఆటగాడి వైపు చెప్పు చూపించడం సరికాదని, పైగా షూ కింద ఉన్న మట్టితో సమానమని చెప్పడం కోహ్లీ స్థాయికి తగదని విమర్శించారు. ఈ గొడవలో విరాట్ కోహ్లీదే తప్పని తీర్పు ఇచ్చారు. అయితే ఈ విషయంలో విరాట్ కోహ్లీని అపార్థం చేసుకున్నారనే విషయం తాజాగా వెలుగు చూసింది.
నవీన్ ఉల్ హక్ వైపు కోహ్లీ షూ చూపించలేదని, అతను చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అంపైర్లకు సంజాయిషి ఇచ్చే క్రమంలో కాలును చూపించాడని చెబుతున్నారు. కోహ్లీ పదే పదే పిచ్‌పైకి వచ్చి కాళ్లతో తొక్కుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడని, దాంతోనే తాను పిచ్‌పైకి రాలేదని, కావాలంటే నా షూకు ఎలాంటి గ్రాస్ లేదని, పిచ్‌పై ఫుట్ మార్క్ కూడా లేదని వివరించాడని కామెంట్ చేస్తున్నారు.
కోహ్లీ సంజాయిషీకి అంపైర్ కన్విన్స్ అయ్యి నవ్వాడని, చెప్పు చూపించి తిడితే అంపైర్ ఎందుకు నవ్వుతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదన కూడా కరెక్ట్‌గా ఉండటంతో కోహ్లీని అపార్థం చేసుకున్నామని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా గంభీర్- కోహ్లీ గొడవ చరిత్రల నిలిచిపోనుంది.