IPL 2023 షెడ్యూల్.. బీసీసీఐ కీలక నిర్ణయం! 74 రోజులు కాస్త 60 రోజులే! ఎందుకంటే..?

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్‌కమింగ్ సీజన్ కోసం ఇప్పటికే మినీ వేలాన్ని పూర్తి చేసిన బీసీసీఐ..
ఏప్రిల్- జూన్ విండోలో లీగ్‌ను పూర్తి చేయాలని భావించింది. కానీ ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ రూపంలో బీసీసీఐకి పెద్ద చిక్కు వచ్చి పడింది. దాంతో 74 రోజుల పాటు లీగ్‌ను నిర్వహించాలనే ప్లాన్స్‌ను బీసీసీఐ తాత్కలికంగా పక్కనబెట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో 60 రోజులు నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించాలని బోర్డు భావిస్తోంది.

మే 31న ఫైనల్..
ప్రస్తుతానికి ఐపీఎల్ షెడ్యూల్ కాకపోయినా ఏప్రిల్ 1న మొదలుపెట్టి మే 31తో ముగించాలని యోచిస్తోంది. ఎందుకంటే జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫైనల్‌కు ఏడు రోజుల ముందు మరే టోర్నీలు నిర్వహించేందుకు వీల్లేదు. దీనికితోడు మార్చిలో మహిళల ఐపీఎల్ కూడా ఉంటుంది కాబట్టి.. పురుషుల టోర్నీని 60 రోజుల్లోనే ముగించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు తెలిపారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌తో..
'మొత్తం ఐపీఎల్(విమెన్, మెన్) విండో మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఉంది. కాబట్టి ఫైనల్ డేట్స్‌ను నిర్ణయించకపోయినా... షెడ్యూల్ మాత్రం తక్కువగానే ఉండే చాన్స్ ఉంది.'అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. లీగ్ ఎక్కువ రోజులు సాగితే ఫారిన్ ప్లేయర్లు అందుబాటులో ఉండటంపై కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. లీగ్ చివరి దశలో అంతర్జాతీయ ఆటగాళ్లు దూరమైతే మ్యాచ్‌లు కళ తప్పుతాయని, ఫ్రాంచైజీలు గగ్గోలు పెడుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్..
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ డేట్స్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. జూన్ 7నుంచి 11 వరకు ఓవల్ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే.. ఐపీఎల్ షెడ్యూల్‌ను ఎట్టి పరిస్థితుల్లో మరింత ముందుకు కుదించాల్సిందే. ఐసీసీ రూల్స్‌తో పాటు భారత ఆటగాళ్లకు కావాల్సిన విశ్రాంతి, ప్రాక్టీస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖారారు చేసుకుంది. ఆ దేశ ఆటగాళ్లు కూడా లీగ్‌ను పెద్ద సంఖ్యలో వీడుతారు. కాబట్టి 60 రోజుల్లోనే ఐపీఎల్‌ను పూర్తి చేయడం ఉత్తమమని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

ముందు నొయ్యి.. వెనుక గొయ్యి..
ఐపీఎల్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్లుగా తయారైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్‌ను ముందుకు జరుపుదామంటే.. మహిళల ఐపీఎల్ అడ్డంకిగా మారింది. ఈ ఏడాది నుంచే 5 జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అందుకు తగ్గట్లు కార్యచరణను కూడా చేపట్టింది. కొత్త జట్ల బిడ్ ప్రక్రియను ప్రారంభించడంతో పాటు షెడ్యూల్, మ్యాచ్ వేదికలను ఖరారు చేయడంపై కసరత్తులు చేస్తోంది. మార్చి విండోను మహిళల ఐపీఎల్‌కు కేటాయించింది. మహిళల ఐపీఎల్‌తో పాటే పురుషుల ఐపీఎల్ ప్రారంభిస్తే.. మహిళల క్రికెట్‌కు ఆదరణ లభించదు. అప్పుడు బీసీసీఐకే నష్టం చేకూరుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications