IPL 2023: మినీ వేలం తర్వాత పవర్‌ఫుల్‌గా ముంబై ఇండియన్స్.. తుది జట్టు అంచనా ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌లకు 4 మాత్రమే గెలిచింది. వరుసగా 8 మ్యాచ్‌లు ఓడి అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ముంబై జట్టుకు, అభిమానులు ఐపీఎల్ 2022 సీజన్ ఓ పీడకల. స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా దారుణంగా విఫలమవడం, జోఫ్రా ఆర్చర్ సీజన్ మొత్తానికి దూరంగా ఉండటం, హై ప్రైజ్ ట్యాగ్‌ను ఇషాన్ కిషన్ తట్టుకోలేకపోవడం వంటివి ముంబైని ముంచాయి.
ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023 మినీవేలంలో ముంబై ఆచితూచి వ్యవహరించింది. టీమ్ బలహీనతలను అధిగమించడంపై ఫోకస్ పెట్టింది. కీరన్ పొలార్డ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించుకొని అతని స్థానాన్ని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌తో భర్తీ చేసింది. రూ.17.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. జైరిచర్డ్‌సన్‌తో, జాసన్ బెహండ్రాఫ్‌లతో బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది.
జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి రావడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ప్రతిభా అన్వేషణలో ముందు ఉండే ముంబై.. డువాన్ జాన్సన్, పామ్స్ ములాని వంటి యువ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మినీ వేలం తర్వాత పేపర్‌పై ముంబై ఒకప్పటిలా బలంగా కనిపిస్తోంది. తుది జట్టు ఎంపికపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్
సరైన ఓపెనింగ్ ఆరంభం లేక ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై మూల్యం చెల్లించుకుంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. అయితే ప్రస్తుం ఈ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. తన ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసుకున్నాడు.
ఆటగాడిగానూ ఎంతో పరణితి సాధించాడు. గత సీజన్‌లోనూ ఒకటి రెండు ఇన్నింగ్స్‌లు బాగా ఆడినా జట్టుకు సరిపోలేదు. ఈ సారి అతను రాణించడం ముంబైతో పాటు అతని కెరీర్‌కు చాలా ముఖ్యం. ఇక గాయాలతో తరుచూ ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు కూడా ఈ సీజన్ చాలా కీలకం. ఈ సీజన్‌లో విఫలమైతే మాత్రం రోహిత్ కెరీర్ అటు అంతర్జాతీయంగా.. ఇటు ఐపీఎల్ పరంగా ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో ఉన్న రోహిత్.. ఐపీఎల్‌లో దంచికొట్టాల్సి ఉంది.

మిడిలార్డర్‌లో సూర్య, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్..
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై తరఫున రాణించిన బ్యాటర్లు సూర్య, తిలక్, టీమ్ డేవిడ్. గాయం కారణంగా సూర్య కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా.. ఆడిన మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. తిలక్ వర్మ.. తన అరంగేట్ర సీజన్‌లోనే దుమ్మురేపి అందరి ప్రశంసలు అందుకున్నాడు. నెంబర్3 స్థానంలో బరిలోకి దిగి 14 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 397 పరుగులు చేశాడు.
సూర్య 8 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేశాడు. హాఫ్ సీజన్ తర్వాత బరిలోకి దిగిన టీమ్ డేవిడ్.. అసాధారణ ఆటతో ఆకట్టుకున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 186 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో విలువైన పరుగులు జోడించాడు. ఈ ముగ్గురూ ఐపీఎల్ 2023లోనూ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. టీమ్ పరిస్థితులకు తగ్గట్లు వీరి బ్యాటింగ్ స్థానాలు మారవచ్చు.

స్పిన్నర్లుగా కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్..
ప్రతీ సీజన్‌లో ఓ యంగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022లో కుమర కార్తీకేయ ప్రతిభను వెలికి తీసింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ముంబైకి కుమార్ కార్తీకేయ కీలకమయ్యాడు. చివర్లో అవకాశం అందుకున్న కార్తీకేయ 4 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.
అప్‌కమింగ్ సీజన్‌లోనూ అతను ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరించనున్నాడు. మరో స్పిన్నర్ హృతిక్ షోకీన్, రమణ్ దీప్ సింగ్, పియూష్ చావ్లాలో ఒకరు అవకాశం దక్కించుకోనున్నారు. రమణ్‌దీప్ సింగ్, హృతికి షోకీన్‌లో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

పేస్ బౌలింగ్.. జే త్రయం
ముంబై ఇండియన్స్ పేస్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, జై రిచర్డసన్‌లతో కూడిన జే త్రయం నడిపించనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐపీఎల్ ఒక్కటనే కాదు.. 2022 బుమ్రాకు కలిసిరాలేదు. గాయాలతో తరుచూ జట్టుకు దూరమయ్యాడు.
ప్రస్తుతం కూడా ఇంజ్యూరీ రికవరీలో ఉన్నాడు. ఐపీఎల్ సమయానికి అతను కోలుకునే అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్ సైతం 2022లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న అతను ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జై రిచర్ట్‌సన్, జాసన్ బెహండ్రాఫ్‌లో ఒకరికి అవకాశం దక్కనుంది. కామెరూన్ గ్రీన్ వీరికి సహకారంగా ఉండనున్నాడు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, జై రిచర్డ్‌సన్/జాసన్ బెహండ్రాఫ్
ముంబై పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణ్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టియన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జేసన్ బెహ్రెండాఫ్, ఆకాష్ మధవాల్, కామెరూన్ గ్రీన్, జై రిచర్డ్‌సన్, పియూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములాని, నేహల్ వాధేరా, రాఘవ్ గోయల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications