Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: వాంఖడే పులి సూరీడు ఔటైతే.. ముంబైకి ఓటమే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయలేక ఓటమికి తలవంచింది. మోహ్‌సిన్ ఖాన్ సూపర్ బౌలింగ్‌తో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్‌కు మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సీజన్‌ను ఓటములతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత అద్భుత విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడం, అచ్చొచ్చిన వాంఖడేలో చెలరేగడంతో వరుస విజయాలందుకుంది.

 Suryakumar Yadav

ఇప్పటి వరకు వాంఖడే వేదికగా 6 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచింది. రెండు మ్యాచ్‌లు కూడా ఆరంభంలోనే ఓటమిపాలైంది. ముంబై గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం గమనార్హం. వాంఖడే వేదికగా చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో సూర్య(1) విఫలమవడంతో ఓటమిపాలైంది.

ఆ తర్వాత కేకేఆర్‌తో మ్యాచ్‌లో 43 పరుగులతో ఫామ్ అందుకున్న సూర్య.. పంజాబ్ కింగ్స్‌పై 57, రాజస్థాన్ రాయల్స్‌పై 55, ఆర్‌సీబీపై 83, గుజరాత్ టైటాన్స్‌పై 103 పరుగులతో రాణించడంతో ముంబై విజయాలందుకుంది. సూర్య ఆడిన ప్రతీ మ్యాచ్‌లో గెలిచిన ముంబై.. ఒక్క పంజాబ్ చేతిలో మాత్రమే ఓటమిపాలైంది.

సూర్య విఫలమైన ప్రతీ మ్యాచ్‌లోనూ ముంబైకి ఓటమి తప్పలేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లోనూ సూర్య 7 పరుగులకే వెనుదిరగడంతో ముంబై ఓటమిపాలైంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లోనే సూర్య రాణించాడు. ఆర్‌సీబీతో బెంగళూరు వేదికగా సూర్య 15 పరుగులే చేయగా ముంబై ఓటమిపాలైంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ సూర్య 7 పరుగులే చేయగా.. సన్‌రైజర్స్ తప్పిదంతో గట్టెక్కింది.

గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూర్య 23 పరుగులే చేయగా.. ముంబై 55 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెన్నై వేదికగా సూర్య 26 పరుగులే చేయగా.. ముంబై 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే సూరీడు ఔటైతే ముంబైకి ఓటమేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అయితే మే 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ వాంఖడే వేదికగా జరగనుండటం ముంబైకి కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో సూర్య చెలరేగాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Wednesday, May 17, 2023, 16:18 [IST]
Other articles published on May 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+