
చెన్నై: ఐపీఎల్ వచ్చినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పేరు సోషల్ మీడియాలో మారుమోగడం సర్వసాధారణం. ప్రాక్టీస్ దగ్గర్నుంచి.. మైదానం వరకు ధోనీ చేసే ప్రతీ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ధోనీ కూడా అందరి కన్నా ముందే ప్రాక్టీస్ క్యాంప్‌లు స్టార్ట్ చేయడం.. యవ ఆటగాళ్లతో నెట్స్‌లో చెమటోడుస్తూ ఉంటాడు.
కుర్రాళ్లకు తన అనుభవాన్ని పాఠాలుగా చెబుతూ.. సీఎస్‌కే టీమ్ మెరుగైన ప్రదర్శన చేసేందుకు కృష్టి చేస్తూ ఉంటాడు. రెండు రోజుల క్రితమే చెన్నైలోని చెపాక్ స్టేడియంలోని కుర్చీలకు ఎల్లో రంగు పెయింట్ వేస్తూ.. అభిమానుల మనసులను దోచుకున్న ధోనీ.. తాజాగా తన వినయంతో ఆకట్టుకున్నాడు.
చెపాక్ వేదికగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు మూడు స్టాండ్లలో అభిమానులకు అనుమతివ్వగా అన్నీ నిండిపోయాయి. ఓ వైపు టీమ్ డగౌట్‌లో ధోనీ బ్యాటింగ్‌కు సిద్దమవుతూ.. టీమ్ మెంబర్స్‌తో బ్యాటింగ్ టెక్నిక్స్ చర్చిస్తుండగా.. మరోవైపు ధోనీ.. ధోనీ అంటూ స్టేడియం దద్దరిల్లేలా అభిమానులు స్లోగన్స్ ఇచ్చారు.
దాంతో ధోనీ వారివైపు తిరిగి రెండు చేతులతో దండం పెట్టాడు. 'మీ అభిమానానికి ఓ దండంరా సామీ'అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్ అయ్యింది.
ఐపీఎల్ 2023 సీజన్‌కు శుక్రవారం(మార్చి 31)న తెరలేవనుండగా.. ఆరంభ మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. బెన్ స్టోక్స్ చేరికతో టీమ్ పటిష్టంగా మారింది. రుతురాజ్ గైక్వాడ్‌కు జతగా బెన్ స్టోక్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడుతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా.. జడేజా, ధోనీ ఫినీషింగ్ బాధ్యతలు మోయనున్నారు. దీపక్ చాహర్‌తో పాటు డ్వేన్ ప్రిటోరియస్, రాజవర్థన్ హంగార్కరే, తుషార్ పాండే పేస్ బాధ్యతలు మోయనున్నారు.