
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో తనకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అంటే ఇష్టమని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నాడు. కోహ్లీతో బ్యాటింగ్ చేయడం తన కోరికని వెల్లడించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన ఈ వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బ్యాటర్.. ఆసీస్ వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్ లో తన ఫేవరేట్ టీమ్, స్పిన్నర్, ఫేవరేట్ బ్యాటర్, భారత్‌లో తనకు నచ్చే ఆహారం గురించి వెల్లడించాడు.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తన ఫేవరేట్ టీమ్ అని చెప్పిన లబుషేన్.. ఈ లీగ్‌లో ఆడే అవకాశం లభిస్తే విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయాలనుందన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఒక్క పదంలో సమాధనం చెప్పమనగా.. 'ఒక వర్డ్ కంటే ఎక్కువని, అతని బ్యాటింగ్ చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది'అని చెప్పాడు. తాను ఎదుర్కున్న బౌలర్లలో బెస్ట్ స్పిన్నర్ ఎవరు? అని అడగగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు వెల్లడించాడు.
టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ రిజ్వాన్‌ల్లో ఎవర్నో ఒకరిని ఎంచుకోవాలనగా.. తనకు సూర్య అంటే చాలా ఇష్టమని చెప్పాడు. క్రికెట్ చరిత్రలో ఎవరి బౌలింగ్‌లో ఆడుంటే బాగుండేదని అనిపించిన బౌలర్ పేరు చెప్పాలనగా.. డేల్ స్టెయిన్, షాన్ పొలాక్, గ్లెన్ మెక్‌గ్రాత్‌ల పేర్లను లబుషేన్ సూచించాడు.
భారత్‌లో నచ్చిన ఫుడ్ ఏంటని అడగ్గా... బటర్ చికెన్, స్పినాచ్ (బచ్చలి కూర), చీజ్ తో తయారుచేసే నాన్ అంటే ఇష్టమని, గడిచిన 8 వారాలుగా రోజూ ఇదే తింటున్నానని తెలిపాడు. ఐపీఎల్ 2023 వేలంలో లబుషేన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నా.. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో అతను అమ్ముడుపోని జాబితాలో నిలిచాడు. అయితే వన్డే సిరీస్ ముగిసినా అతను ఇక్కడే ఉండటంతో.. ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడనే ప్రచారం జరుగుతోంది.