గువహతి: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్.. తమ హోమ్ గ్రౌండ్ జైపూర్‌లో ఆడకుండా గువహతిలో ఆడుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 72 పరుగుల తేడాతో ఓడించిన రాజస్థాన్.. రెండో మ్యాచ్‌ను గువహతిలో ఆడుతోంది. ఈ సారి ఐపీఎల్‌ను హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో ఆడుతుండగా.. ప్రతీ జట్టు సొంతగడ్డపై ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఐదు మ్యాచ్‌లనే ఆడనుంది. మరో రెండు మ్యాచ్‌లను అస్సోంలోని గువహతి వేదికగా ఆడాలని ఆ ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది.
తమ రెండో హోం గ్రౌండ్‌గా గువహతి మైదానాన్ని ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను గువహతి వేదికగా ఆడుతోంది. అస్సాం క్రికెట్ అసోషియేషన్‌తో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. అస్సాంలో క్రికెట్‌ను మరింత అభివృద్ది చేసేందుకు ఆ రాష్ట్ర అసోసియేషన్‌తో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకుంది.

అక్కడ ఓ క్రికెట్ అకాడమీని కూడా పెట్టేందుకు కూడా ప్రణాళికలు చేస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగాను గువహతిలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాలని అస్సాం క్రికెట్ అసోషియేషన్ కోరింది. వారి కోరిక మేరకు అక్కడ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌లను ఆడుతోంది. ఈ నెల 8న (శనివారం) కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో అక్కడే మరో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సొంత మైదానం జైపూర్‌లో మిగిలిన 5 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరై మ్యాచ్‌ను వీక్షించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్(56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 నాటౌట్ ) అజేయ హాఫ్ సెంచరీతో పాత ధావన్‌ను తలపించగా... యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. అశ్విన్,, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.