
చెన్నై: పేలవ బౌలింగ్‌తోనే ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్నామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. సోమవారం చెపాక్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చెన్నైకి ఇదే తొలి విజయం కాగా.. లక్నోకు తొలి ఓటమి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయాన్ని అందుకున్న లక్నో.. చెన్నైతో ఆ జోరు కొనసాగించలేకపోయింది. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేఎల్ రాహుల్.. బౌలింగ్ పవర్ ప్లేలో ధారళంగా పరుగులివ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'టాస్ గెలిచిన తర్వాత శుభారంభం అందుకోలేకపోయాం. తొలి రెండు ఓవర్లలో బంతి పిచ్‌కు అతుక్కుపోవడంతో పాటు మూవ్‌మెంట్ లభించింది. కానీ మేం సరైన ప్రదేశంలో బంతులు వేయలేకపోయాం. దాంతో చెన్నై బ్యాటర్లకు ధాటిగా ఆడే ఆస్కారం లభించింది. ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు బౌలింగ్‌లో తప్పులు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఆడిన తీరు అమోఘం. కొత్త వికెట్‌పై ఆడుతున్నప్పుడు సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేయడం తెలియడానికి సమయం పడుతోంది. కానీ పవర్ ప్లేలోనే 70 పరుగులు సమర్ఫించుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. బ్యాటింగ్‌లో మేం కూడా అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాం. కానీ చిన్న చిన్న విషయాలను అందిపుచ్చుకోలేకపోయాం. కైల్ మేయర్స్ తన ఫామ్‌ను కొనసాగించాడు. బంతిని క్లీన్‌గా హిట్ చేశాడు. వెస్టిండీస్ తరఫున ఎలా ఆడాడో.. ఇక్కడా అదే ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాణించడం గొప్ప విషయం. రవి బిష్ణోయ్ సైతం అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే అతను వికెట్లు తీసాడు. పరుగుల వరద ఆపేందుకు తనవంతు కృషి చేశాడు. టాస్ నిర్ణయం వల్ల జట్టుకు జరిగిన నష్టం ఏం లేదు. చిన్న చిన్న విషయాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యాం.
బ్యాటింగ్ మేం అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నా.. చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెట్టలేకపోయాం. మా జట్టులో నలుగురు నుంచి ఐదుగురు బ్యాటర్లు బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. తదుపరి మ్యాచ్‌ల్లో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేకున్నా.. మా ఆట తీరు ఇలానే కొనసాగుతోంది.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.