హైదరాబాద్: మండు వేసవిలో.. పరుగుల విందును అందించే క్రికెట్ మెగా లీగ్ ఐపీఎల్ 2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. రెండు నెలలపాటు అభిమానులను ఉర్రూతలూగించనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో నాలుగుసార్లు చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ మధ్య మరికొద్దిసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే ఈ మ్యాచ్ ముందు అభిమానులను ఓ సందేహం వెంటాడుతోంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను బీసీసీఐ నాలుగు విభాగాలుగా విభజించి కోట్ల రూపాయలను ఆర్జించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానమైన టీవీ హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకోగా.. ఓటీటీ రైట్స్‌ను వయోకామ్ సంస్థకు చెందిన జియో సినిమా సొంతం చేసుకుంది.

దాంతో ఈ సారి ఈ రెండు సంస్థలు అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇన్నాళ్లు స్టార్ స్పోర్ట్స్‌కే ఓటీటీ రైట్స్ ఉండటంతో ఆ సంస్థకే చెందిన డిస్నీ హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు వచ్చాయి. దాంతో స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్లే డిస్నీ హాట్‌స్టార్‌లో కనిపించేవారు. కానీ ఈ సారి రెండు ఫ్లాట్ ఫామ్స్‌లో వేర్వేరు కామెంటేర్స్ కనిపించనున్నారు.
దాంతో జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ పోటాపోటీ ప్రమోషన్స్ చేస్తున్నాయి. జియో సినిమా తమ ప్రచారకర్తగా మహేంద్ర సింగ్ ధోనీని నియమించుకోగా.. స్టార్ స్పోర్ట్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలతో ఒప్పందం కుదుర్చుకుంది. కామెంటేటర్లు, టీవీ క్రూ అంతా ఎవరికి వారే ఉన్నారు.
ఈ క్రమంలోనే టాస్ సమయంలో ఏ సంస్థకు చెందిన హోస్ట్ కనిపిస్తాడనే డౌట్ అభిమానుల్లో మొదలైంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సంస్థలకు చెందినవారు కాకుండా తటస్థంగా పనిచేసే కొంత మందిని బీసీసీఐ నియమించినట్లు తెలుస్తోంది.
వీరి ద్వారానే టాస్ వేయిస్తుందని, ఈ ఫీడ్‌ను జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ ప్రచారం చేసుకోవచ్చని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. తొలి మ్యాచ్‌తో ఈ సందేహానికి అయితే సమాధానం దొరకనుంది.