IPL 2023: విజయ్ శంకర్‌తో పాటు ముగ్గురు ఆటగాళ్లను వదిలేయనున్న గుజరాత్ టైటాన్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. సంచలన ప్రదర్శనతో లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్-1, ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి తొలి టైటిల్‌ను ముద్దాడింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టిగా రాణించింది.
ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో ప్లేయర్ సత్తా చాటడంతో అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ చేరిన గుజరాత్.. కీలక ఫైనల్లో హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏకపక్షంగా టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో హార్దిక్ (3/17) మూడు వికెట్లు తీయడంతో పాటు 34 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, లాకీ ఫెర్గూసన్, వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వచ్చే సీజన్‌లో కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్న ఆ జట్టు.. పేలవ ప్రదర్శన కనబర్చిన ముగ్గురి ఆటగాళ్లను వదులుకోవాలనుకుంటుంది.

విజయ్ శంకర్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆల్‌రౌండర్ ట్యాగ్ ఉండటంతో విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.కోటి 40 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతనిపై అంతే నమ్మకంతో టోర్నీ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించింది. నెంబర్ 3 బ్యాటర్‌గా పంపించింది. కానీ విజయ్ శంకర్ మాత్రం తనదైన శైలిలోనే దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 4, 13,2, 0 తో 19 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 9 బంతులు మాత్రమే వేసి వికెట్ తీయకుండా 15 పరుగులిచ్చాడు. దాంతో అతన్ని పక్కనపెట్టిన గుజరాత్ మెనేజ్‌మెంట్ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మంచి భారత్ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తోంది.

మాథ్యూ వేడ్
టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటి ఆస్ట్రేలియాకు టైటిల్ అందించిన మాథ్యూ వేడ్‌ను గుజరాత్ టైటాన్స్ మెగా వేలంలో పోటీపడి మరీ రూ.2.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆరంభంలో స్పెషలిస్ట్ కీపర్ సాహాను కాదని మాథ్యూవేడ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఆరంభంలో ఓపెనర్‌గా ఆడించింది. కానీ అతను మాత్రం జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో అతన్ని కొన్ని మ్యాచ్‌లకు పక్కపెట్టిన గుజరాత్.. సాహాను ఓపెనర్‌గా ఆడించింది. ఆ తర్వాత మళ్లీ వేడ్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ పంపించింది. కానీ అతను మాత్రం రాణించలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 15.7 సగటులతో 157 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే వేడ్‌ను పక్కనపెట్టి మంచి వికెట్ కీపర్ బ్యాటర్‌ను ఎంచుకోవాలని గుజరాత్ భావిస్తోంది.

వరున్ ఆరోన్..
భారత వెటరన్ పేసర్ వరున్ ఆరోన్‌ను రూ.50 లక్షల కనీస ధరకు తీసుకున్న గుజరాత్ టైటాన్స్.. అతనికి తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించింది. రెండు వికెట్లు తీసిన ఆరోన్.. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో అతన్ని తప్పించిన గుజరాత్ బెంచ్‌కే పరిమితం చేసింది. జట్టు కోచ్ ఆశీష్ నెహ్రా ఆశించిన రీతిలో ఆరోన్ బౌలింగ్ చేయకపోవడంతో అతన్ని పక్కనపెట్టి యశ్ దయాల్ వంటి యువ పేసర్‌కు అవకాశం ఇచ్చింది. అతను రాణించడంతో ఆరోన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్‌న్‌ను గుజరాత్ వదులుకోవాలనుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications