హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి నిరాశే ఎదురైంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారిపట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన డూఆర్‌డై మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ముంబై ఇండియన్స్ టోర్నీలో ముందడుగు వేయగా.. ఆర్‌సీబీ నిష్క్రమించింది.
మరోసారి మిడిలార్డర్ వైఫల్యం ఆర్‌సీబీ కొంపముంచింది. విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీతో పోరాడినా.. శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో శతక్కొట్టడంతో గుజరాత్ టైటాన్స్ విజయాన్నందుకుంది. అయితే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ పూర్తిగా విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లపైనే ఆధారపడింది.

బ్యాటింగ్ భారాన్ని మోత్తం కేజీఎఫ్ మోయగా.. బౌలింగ్ సిరాజ్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. దాంతో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా ఆర్‌సీబీ కోల్పోయింది. ముఖ్యంగా గత సీజన్‌లో ఫినిషర్ పాత్ర పోషించిన దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. 11.67 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు.
ఆర్‌సీబీ యువ ఆటగాళ్లలో అనూజ్ రావత్ మినహా మరొకరు రాణించలేదు. షెహ్‌బాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమ్రోర్ దారుణంగా విఫలమయ్యారు. వానిందు హసరంగా కూడా జట్టుకు భారంగా మారారు. రజత్ పటీదార్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లే వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో దూరమవడం ఆర్‌సీబీని దెబ్బతీసింది. హర్షల్ పటేల్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో వచ్చే ఏడాది ఆర్‌సీబీ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగా, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లను వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ వేలానికి ముందు ఈ ఆటగాళ్ల పెర్ఫామెన్స్‌ను బట్టి ఆర్‌సీబీ తుది నిర్ణయం తీసుకోనుంది. మిడిలార్డర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగాన్ని ఆ జట్టు పటిష్టం చేసుకోవాల్సి ఉంది.