హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్ ఆ జట్టు కొంపముంచింది. ముఖ్యంగా ముగ్గురు బ్యాటర్లు రనౌటవ్వడం జట్టు పతనాన్ని శాసించింది.
ఎలిమినేటర్ మ్యాచ్ ముందుకు వరకు అసాధారణ ప్రదర్శన కనబర్చిన లక్నో సూపర్ జెయింట్స్.. కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. గతేడాది ఆర్‌సీబీ చేతిలో ఎలిమినేటర్‌లోనే ఓడిన లక్నో.. ఈ సారి కూడా డూఆర్‌డై మ్యాచ్‌లోనే ఓడి టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో టోర్నీ మధ్యలోనే వెనుదిరిగినా కృనాల్ పాండ్యా సారథ్యంలో అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

రాహుల్‌తో పాటు ఆవేశ్ ఖాన్, జయదేవ్ ఉనాద్కత్, మార్క్ వుడ్ సేవలను లక్నో కోల్పోయింది. అయినా యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో విజయాలందుకుంది. టోర్నీ ఆరంభంలో రాణించిన కైల్ మేయర్స్ తర్వాత వరుసగా విఫలమవ్వడం.. దీపక్ హుడా పూర్తిగా చేతులెత్తేయడం ఆ జట్టు కొంపముంచింది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్ కృనాల్ పాండ్యాతో పాటు బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్ గోల్డెన్ డకౌటవ్వడం విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన దీపక్ హుడా 7.64 సగటుతో 84 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 12 మ్యాచ్‌ల్లో 90 బంతులు మాత్రమే ఆడిన దీపక్ హుడా 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. 34 బంతులను డాట్ చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. ఈ పేలవ ఫామ్ నేపథ్యంలోనే అప్‌కమింగ్ సీజన్ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ దీపక్ హుడాను వదిలేసే అవకాశం ఉంది.
దీపక్ హుడాతో పాటు అంతా ప్రభావం చూపని సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై కూడా వేటు వేయనున్నారు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన మిశ్రా.. 7 వికెట్లు మాత్రమే తీసాడు. వయసు కూడా పైబడిన నేపథ్యంలో అప్‌కమింగ్ సీజన్ ముందు వదిలేయనున్నారు.
ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడని డానియల్ సామ్స్, కరుణ్ నాయర్, మయాంక్ యాదవ్, ఒక్క మ్యాచే ఆడిన మనన్ వోహ్రా, రొమారియో షెఫార్డ్‌లను కూడా లక్నో వదులుకోనుంది. అపకమింగ్ సీజన్ వేలానికి ముందు ఈ ఆటగాళ్ల ఫామ్‌ను బట్టి ఈ రిలీజ్ లిస్ట్‌లో కాస్త మార్పులు జరగవచ్చు.