అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం వచ్చే సూచనలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. 'వర్షం కారణంగా ఆదివారం పూర్తిగా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాం.
ఓ క్రికెటర్‌గా ఎప్పుడూ ఆడటానికి ప్రాధాన్యతిమిస్తాను. వర్షం కారణంగా మైదానానికి వచ్చిన ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడ్డారు. వారికి కావాల్సిన మజాను ఈ రోజు మేం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. పిచ్‌పై చాలా గంటలు కవర్ కప్పి ఉంచారు. కానీ టోర్నీ ఆసాంతం ఇక్కడి పిచ్ బాగానే ఉంది. 20 ఓవర్ల గేమ్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీకి న్యాయం జరిగినట్లే. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. 'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే తన మనస్సు మాత్రం బ్యాటింగ్ చేయమని చెబుతుందని, దాంతోనే టాస్ ఓడినా పెద్దగా బాదలేదన్నాడు. వాతావరణ పరిస్థితులు తమ చేతుల్లో లేవని జట్టులో చర్చించామన్నాడు. ఏ జట్టు బాగా ఆడుతుందో ఆ టీమ్‌నే టైటిల్ వరిస్తుందని చెప్పాడు.
తమ ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచేందుకు వీలైనంత ప్రయత్నిస్తానని చెప్పిన హార్దిక్.. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, మతీష పతీరణ, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ.